Begin typing your search above and press return to search.

ట్రంప్ కు భారీ షాకిచ్చిన న్యూయార్క్ కోర్టు

తాజాగా సదరు కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. ముగ్గురు జర్నలిస్టులకు భారీ పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు ఇవ్వటం గమనార్హం.

By:  Tupaki Desk   |   14 Jan 2024 10:15 AM IST
ట్రంప్ కు భారీ షాకిచ్చిన న్యూయార్క్ కోర్టు
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కోర్టుల్లో ఆయనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓవైపు దేశాధ్యక్ష పదవికి రెండో సారి తీవ్రంగా కసరత్తు చేస్తూ.. ప్రజాదరణలో ముందున్న ఆయనకు.. న్యాయస్థానాల్లో మాత్రం ఎదరుదెబ్బల పరంపరకు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా ఒక పాత కేసుకు సంబంధించిన ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తన వ్యక్తిగత విషయాల్ని కథనాలుగా రాసిన ముగ్గురు జర్నలిస్టులు తనకు పరిహారం చెల్లించాలన్న ఆయన వేసిన కేసు.. చివరకు ఆయనకే ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. తాజాగా సదరు కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. ముగ్గురు జర్నలిస్టులకు భారీ పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు ఇవ్వటం గమనార్హం.

ఇంతకూ కేసేమంటే.. ప్రఖ్యాత మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ కు చెందిన ముగ్గురు జర్నలిస్టులు ట్రంప్ మీద పరివోధాత్మక కథనం రాశారు. స్వశక్తితో తాను భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా ట్రంప్ గా చెబుతుంటారు. అయితే.. ఆ మాటల్లో అస్సలు నిజం లేదని.. ఆయన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ నుంచి ట్రంప్ నకు 41.3కోట్ల డాలర్ల భారీ ఆస్తి లభించిందన్న విషయాన్ని ఈ ముగ్గురు జర్నలిస్టులు వెలికి తీశారు. అంతేకాదు.. తండ్రీ కొడుకులు పన్నుల ఎగవేత ద్వారా బాగా వెనకేసుకున్న విషయం బయటకు వచ్చింది. అయితే.. అది ట్రంప్ సోదరి మేరీ ట్రంప్ రాసిన పుస్తకం ద్వారానే.

సదరు పుస్తకం 2020లో బయటకు వచ్చింది. ఈ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులకు మేరీ ట్రంప్ బోలెడన్ని ఇంటి రహస్యాల్ని వెల్లడించారు. దీని మీద జర్నలిస్టులు తనకు 10 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని కోరుతూ 2021లో ట్రంప్ కోర్టును ఆశ్రయంచారు. అయితే.. ఈ కేసు నుంచి ముగ్గురు జర్నలిస్టులను పరిహరించటమే కాదు.. వారికి కోర్టు ఖర్చుల కింద 4 లక్షల డాలర్లు ఇవ్వాలని తాజాగా తీర్పును ఇచ్చారు.

అదే సమయంలో కుటుంబ వ్యవహారాలు బయటపెట్టకూడదంటూ ముందే కుదుర్చుకున్న ఒప్పందాన్ని మేరీ ట్రంప్ ఉల్లంఘించారంటూ ట్రంప్ లాయర్లు చేసిన ఆరోపణ మీద మాత్రం విచారణ ఇంకా నడుస్తోంది. రానున్న రోజుల్లో ఈ కేసులో ట్రంప్ ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న వేళ.. న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బల పరంపర ఆగితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.