Begin typing your search above and press return to search.

మళ్లీ సిద్ధూ వర్సెస్‌ డీకే

డీకే శివకుమార్‌ కు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది.

By:  Tupaki Desk   |   2 April 2024 4:04 AM GMT
మళ్లీ సిద్ధూ వర్సెస్‌ డీకే
X

కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా అధికారంలో ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో ఒకటి.. కర్ణాటక. 2013 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం దక్కించుకుంది. ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ గట్టిగా పోటీపడ్డారు. అయితే అధిష్టానం సిద్ధరామయ్యకే అవకాశం ఇచ్చింది. డీకే శివకుమార్‌ కు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. దీంతో డీకే కూడా సర్దుకుపోయారు.

అయితే ఇప్పుడు లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి నాయకత్వ మార్పు అంశం తెరమీద కొచ్చింది. కర్ణాటకలో మొత్తం 28 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. బీజేపీ, మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌ ఈసారి కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ 28 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతోంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వేర్వేరుగా చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. ప్రస్తుతం సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. చామరాజ నగర్‌ ఎంపీ స్థానం పరిధిలోకి వరుణ నియోజకవర్గం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

2019 పార్లమెంటు ఎన్నికల్లో చామరాజనగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కేవలం 1817 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారని గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తనకు వరుణ నియోజకవర్గంలో 48 వేల మెజారిటీ అందించారని చెప్పారు. ఇప్పుడు లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 60 వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానన్నారు. అదే జరిగితే తాను ముఖ్యమంత్రి పదవిలో నిశ్చింతగా ఉంటానన్నారు. తనను ఎవరూ తాకలేరని హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాబట్టి తాను ముఖ్యమంత్రిగా ఉండాలో, వద్దో ఓటర్ల చేతుల్లోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధూ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మాండ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను చూసే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారని.. మీ కోరిక నెరవేరకుండా పోదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

సిద్ధూ, డీకే వ్యాఖ్యలను బట్టి ఫైనల్‌ గా తెలిసేది ఏంటంటే.. 28 పార్లమెంటు స్థానాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలిస్తే సీఎంగా సిద్ధరామయ్య పదవికి ఢోకా ఉండకపోవచ్చు. అలా కాకుండా బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిస్తే నాయకత్వ మార్పు అంశం తీవ్రమయ్యే చాన్సు ఉందని అంటున్నారు. అప్పుడు డీకే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు.