Begin typing your search above and press return to search.

బలంగా ఉండీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడింది ఇందుకేనా?

మధ్యప్రదేశ్ లో వాస్తవానికి బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారుపై మంచి అభిప్రాయం లేదు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 12:30 AM GMT
బలంగా ఉండీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడింది ఇందుకేనా?
X

ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం మూడుచోట్ల గెలుస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. వీటిలో తెలంగాణలో మాత్రమే ఆ పార్టీ అధికారం దక్కించుకుంది. మిగతా మూడు పెద్ద రాష్ట్రాల్లో పవర్ కోల్పోయింది. తెలంగాణలో అందరూ ఊహించినట్లుగానే టీమ్ వర్క్ తో ఆ పార్టీ గెలిచింది. కానీ, ఓ రాష్ట్రంలో మాత్రం దారుణంగా ఓడింది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు పక్కా అని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అదే చెప్పాయి. అక్కడి సీఎం సైతం పాలన, సంక్షేమ పథకాల పరంగా మంచి మార్కులే పొందారు. కానీ, అనూహ్యంగా పరాజయం ఎదురైంది. దీనిపై పోస్టు మార్టం చేస్తే అసలు విషయం తేలింది.

ఎందుకు చేజారిందంటే?

రాజస్థాన్ , మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మిజోరం. మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాలివి. వీటిలో మిజోరంలో ప్రాంతీయ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడింది. రాజస్థాన్ లో ఒక పార్టీకి ఒకసారి మాత్రమే అవకాశం ఇచ్చే సంప్రదాయం ఉంది. మధ్యప్రదేశ్ లో వాస్తవానికి బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారుపై మంచి అభిప్రాయం లేదు. కానీ, ఆయన చివర్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి పార్టీని గెలిపించారు. ఇక మిగిలింది ఛత్తీస్ గఢ్. ఈ రాష్ట్రంలో భూపేష్ బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పరంగా మంచి మార్కులే పొందింది. ఎన్నికల్లో గెలుపు ఖాయం అనుకున్నారు కూడా. విశ్లేషణలూ అదే చెప్పాయి. అయితే, ఫలితాలు చూస్తే బఘేల్ సర్కారు బోల్తా కొట్టింది.

సర్వే లేదు.. గెలుపు సంగతే లేదు..

ఛత్తీస్ గఢ్ లో 90 సీట్లున్నాయి. చిన్న రాష్ట్రమే. నక్సల్ ప్రభావం కూడా అధికం. అలాంటిచోట బఘేల్ మంచి ప్రభుత్వం ఇచ్చారన్న పేరు తెచ్చుకున్నారు. 2018లో బీజేపీని కాదని కాంగ్రెస్ ను ఎన్నుకున్నందుకు బఘేల్ న్యాయం చేశారు. తాజా ఎన్నికల్లో మాత్రం ఆయన అతి విశ్వాసానికి పోయారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత తరం రాజకీయాల్లో పార్టీలన్నీ సర్వేలపై ఆధారపడి టికెట్లు ఇస్తున్నాయి. అందులోనూ అధికార పార్టీ అయితే ఎప్పటికప్పుడు నిఘా విభాగం నివేదికలను తెప్పించుకుని ముందుకెళ్తుంది. మరి ఏం జరిగిందో ఏమో కానీ.. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ 22 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేసింది. వీరి స్థానంలో టికెట ఇచ్చిన 15 మంది ఓడిపోయారు. పార్టీ బలంగా ఉండి.. ప్రభుత్వానికీ మంచి మార్కులు పడినా పరాజయానికి ఇదే ప్రధాన కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఛత్తీస్ లో బీజేపీ 54 సీట్లు నెగ్గింది. కాంగ్రెస్ 35 వద్ద ఆగిపోయింది. ఒకవేళ పద్ధతిగా వెళ్లి ఉంటే.. 22 మందికి ఒకేసారి టికెట్ కట్ చేయకుంటే.. ఈ ఫలితం తారుమారు అయ్యేదేమో?