Begin typing your search above and press return to search.

2 గంటల ఫోన్ కాల్.. బైడెన్.. జిన్ పింగ్ మధ్య వాదులాట

ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య ఫోన్ కాల్ లో వీరిద్దరు ఎవరికి ఎవరు తగ్గకుండా మాట్లాడుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   4 April 2024 6:27 AM GMT
2 గంటల ఫోన్ కాల్.. బైడెన్.. జిన్ పింగ్ మధ్య వాదులాట
X

విన్నంతనే విచిత్రంగా అనిపించటంతోపాటు.. నిజంగానే జరిగిందా? దీని వెనుక అసలు ముచ్చట ఇంకేమైనా ఉందా? అన్న సందేహం కలుగుతుంది. ఇంతకూ విషయం ఏమంటే అగ్రరాజ్యాధినేత బైడెన్.. చైనా అధినేత జిన్ పింగ్ ల మధ్య తాజాగా జరిగిన ఫోన్ కాల్ రచ్చగా మారిందంటున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య ఫోన్ కాల్ లో వీరిద్దరు ఎవరికి ఎవరు తగ్గకుండా మాట్లాడుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక్కడ విషయం ఏమంటే.. రెండు అగ్రదేశాలకు చెందిన అధినేతల మధ్య నడిచిన ఫోన్ కాల్ వివరాలు ఎవరు బయటపెట్టారన్నది పాయింట్. ఇక.. వార్తాంశంగా మారిన ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాల్ని చూస్తే.. టిక్ టాక్ మీద అమెరికా చర్యలు చేపట్టిన అంశం మొదలు తైవాన్ కు సాయంగా నిలవటం.. రష్యాకు సాయం నుంచి హైటెక్ టెక్నాలజీ వరకు వివిధ అంశాల మధ్య అమెరికా-చైనా దేశాధినేతల మధ్య చర్చ రచ్చగా మారిందంటున్నారు.

దాదాపు రెండు గంటల పాటు వాదులాడుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఇద్దరు అధినేతలు ఏ భాషలో సంవాదం జరిగిందన్నది ప్రశ్న. ఎందుకంటే.. బైడెన్ కు చైనీస్ రాదు. జిన్ పింగ్ కు ఇంగ్లిష్ అంతగా రాదు. అయితే.. వీరిద్దరి మధ్య ఫోన్ కాల్ లో ట్రాన్స్ లేటర్లు ఉండి ఉన్నప్పటికీ.. వాస్తవంలో అంత తేలికైన ముచ్చట కాదంటున్నారు. గత నవంబరులో కాలిఫోర్నియాలో జరిగిన శిఖరాగ్ర సదస్సు తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన తొలి ఫోన్ కాల్ ఇదేనని చెబుతున్నారు.

ఇద్దరి మధ్య హాట్ హాట్ గా ఫోన్ కాల్ జరిగిందని.. ఒకరికొకరు హెచ్చరికలుచేసుకునే వరకు విషయాలు వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. చైనాకు అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల అమ్మకంపై బైడెన్ సర్కారు నిషేధం విధించటాన్నిచైనా అధ్యక్షుడు తీవ్రంగా తప్పు పట్టారు. తమ హక్కుల్ని కాలరాసేందుకు ప్రయత్నిస్తే సహించమని చెప్పటంతో పాటు.. తైవాన్ విషయంలో గీత దాటొద్దన్న వార్నింగ్ చైనా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆధునిక టెక్నాలజీ తమ భద్రతకు ముప్పుగా మారితే సహించేది లేదని బైడెన్ స్పష్టం చేయటంతో పాటు.. తమ పౌరుల డేటా పరిరక్షణ అన్నిటికంటే ముఖ్యమని.. టిక్ టాక్ పై చర్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పటం ద్వారా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పినట్లుగా చెబుతున్నారు. మరి.. దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉండనున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.