Begin typing your search above and press return to search.

మాజీ సీఎం పదవే కాదు.. 20 ఏళ్ల బంగ్లా కూడా కొత్త సీఎంకు

ఆరు గ్యారెంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 12:22 PM IST
మాజీ సీఎం పదవే కాదు.. 20 ఏళ్ల బంగ్లా కూడా కొత్త సీఎంకు
X

రాజకీయాల్లో ఏదైనా పదవి ఉన్నంత వరకే.. అందుకే నాయకులు పదవుల కోసం అంతగా వెంపర్లాడుతుంటారు. ఇక అధికారంలో ఉండగా దక్కే గౌరవాభిమానాలు వేరు. ప్రభుత్వ అధికారులు, మందీ మార్బలం.. బంగళాలు.. కార్లు.. కాన్వాయ్ లు.. ఆ వైభోగమే వేరు. ఈక్రమంలో నాయకుల నడక.. నడత అన్నిటినీ ప్రజలు గమనిస్తుంటారు. కాగా, తెలంగాణలో ఇటీవల అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పోయి.. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆరు గ్యారెంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక రాష్ట్ర స్థాయిలో వరుసగా అధికారుల బదిలీలు, నియమాకాలు చేపడుతోంది. మిగిలింది ఢిల్లీ స్థాయిలో చేయాల్సినవే.

2004 నుంచి అక్కడే..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 2004లో తొలిసారి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి.. నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తుగ్లక్ రోడ్ లోని బంగళాను ఆయనకు నివాసంగా కేటాయించారు. కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నప్పటికీ.. 2014 వరకు ఎంపీ హోదాలో ఆ బంగళాను తన నివాసంగా కొనసాగించారు కేసీఆర్. ఆపై తెలంగాణ ఏర్పాటు.. సీఎంగానూ బాధ్యతలు చేపట్టడంతో ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసం తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంగా మారింది. 2014లోనే కేసీఆర్ కుమార్తె కవిత సైతం నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసాన్ని ఆమె వినియోగించారు. అలా 20 ఏళ్ల నుంచి ఢిల్లీ తుగ్లక్ రోడ్ 23లోని బంగళా కేసీఆర్ కుటుంబ నివాసంగా మారిపోయింది.

ఇప్పుడది రేవంత్ కు..

ఈ నెల 3న తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్‌ రెడ్డి వచ్చారు. మొన్నటివరకు రేవంత్ ఎంపీగానే ఉన్నారు. ఇప్పుడు సీఎం అయిన నేపథ్యంలో ఢిల్లీలో తెలంగాణ సీఎంకు అధికారిక నివాసం కేటాయించాల్సి ఉంది. ఇక్కడే చిన్న గమ్మత్తు జరిగింది. రేవంత్ కోసం తుగ్లక్ రోడ్ 23లోని అధికారిక నివాసాన్ని అధికారులు సిద్ధం చేశారు. కేసీఆర్ నేమ్ ప్లేట్ ను తొలగించి, దాని స్థానంలో రేవంత్ రెడ్డి పేరుతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో కొత్త నేమ్ ప్లేట్ ఏర్పాటు చేశారు. కాగా కేసీఆర్ ఇప్పటికే ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. కొత్త సీఎం కోసం ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు మరమ్మతులు నిర్వహించారు. రేవంత్ బంధువులు తుగ్లక్ రోడ్ బంగళాలో పూజలు నిర్వహించినట్లు తెలిసింది. మంగళవారం ఢిల్లీ వస్తున్న రేవంత్.. తుగ్లక్ రోడ్ లోని అధికారిక నివాసంలో ఉంటారా? లేదా? చూడాలి. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో తుగ్లక్ రోడ్ లోని సీఎం నివాసం వద్ద ఒక్కో నెల చొప్పున నాలుగు పోస్ట్ లకు చెందిన తెలంగాణ బెటాలియన్ (దాదాపు 50 మంది) సిబ్బంది కాపలా ఉండేవారు. సర్దార్ పటేల్ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కేంద్ర కార్యాలయం ప్రారంభమైన తర్వాత మరిన్ని స్పెషల్ టీమ్ లను గత ప్రభుత్వం ఢిల్లీలో మోహరించింది. ఇక వసంత్ విహార్ లోని కొత్త భవనానికి భద్రతను పెట్టింది. దీనికి తోడు సీఎం సెక్యూరిటీ ఫోర్స్ అదనంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ భద్రతను రేవంత్ తగ్గించారు. తుగ్లక్ రోడ్ కోసం వచ్చే తెలంగాణ బెటాలియన్ ను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు.

కొసమెరుపు: సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ బేగంపేటలో కేసీఆర్ ప్రగతి భవన్ పేరిట 9 ఎకరాల్లో భారీ నివాసం కట్టుకున్నారు. దానిని రేవంత్ సీఎం అయ్యాక ప్రజా భవన్ గా మార్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నివాసంగా కేటాయించారు. ఇప్పుడు ఢిల్లీ నివాసం కూడా 20 ఏళ్ల తర్వాత కేసీఆర్ చేజారింది. ఉమ్మడి రాష్ట్రలో ఎంపీగా ఉన్నప్పుడే తుగ్లక్ రోడ్ భవనాన్ని నివాసంగా ఉంచుకోగలిగిన కేసీఆర్ కు ఇప్పుడు ఖాళీచేయక తప్పని పరిస్థితి వచ్చింది.