Begin typing your search above and press return to search.

శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి ఎందుకు జరిగింది

తాజాగా ఏపీకి చెందిన కొందరు భక్తులు ఇదే విధంగా తమిళనాడులోని తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయానికి వెళ్లారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:50 AM GMT
శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి ఎందుకు జరిగింది
X

తమిళనాడులోని ప్రముఖ శ్రీరంగం ఆలయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు శబరిమలలో అయ్యప్ప దర్శనం తర్వాత పలు పుణ్యక్షేత్రాల్ని సందర్శించుకొని ఇంటికి చేరటం తెలిసిందే. తాజాగా ఏపీకి చెందిన కొందరు భక్తులు ఇదే విధంగా తమిళనాడులోని తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడి ఆలయ సిబ్బంది ఆంధ్రా భక్తులపై దాడికి పాల్పడిన వైనం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. భక్తుడి రక్తం చిందేలా దాడి చేయటాన్ని తప్పుపడుతున్నారు.

ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ముప్ఫై మంది అయ్యప్ప భక్తులు కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు మంగళవారం శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. స్వామి దర్శనం కోసం క్యూలో నిల్చున్నారు. ఈ సందర్భంగా కొందరు క్యూ పద్దతిలో నిల్చోకుండా మధ్యలో వెళ్లి నిలిచారు. దీనిపై ఆలయ సిబ్బందికి మిగిలిన భక్తులు కంప్లైంట్ చేశారు.

ఆ తర్వాత గర్భగుడి ముందున్న గాయాత్రి మండపంలో ఏపీకి చెందిన భక్తులు నిలబడటంతో రద్దీ నెలకొంది. ఆలయ సిబ్బంది అత్యుత్సాహంతో ఆంధ్రాభక్తులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఏపీకి చెందిన చెన్నారావు అనే భక్తుడిపై చేయి చేసుకున్నారు ఆలయ సిబ్బంది. దీంతో.. అతడి ముక్కు నుంచి రక్తం కారేలా కొట్టటంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భక్తులుఆలయంలోనే నిరసన చేపట్టి.. ధర్నా చేశారు. మిగిలిన భక్తులు సైతం వారికి మద్దతు నిలిచారు.

ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఆలయానికి వచ్చి.. ఆందోళన చేస్తున్న భక్తులకు సర్ది చెప్పి వారిని తమతో తీసుకెళ్లారు. ఆలయ సిబ్బందికి చెందిన ముగ్గురిపైన పోలీస్ స్టేషన్ లో భక్తులు కంప్లైంట్ ఇచ్చారు. ఆలయ సిబ్బంది సైతం భక్తులపై ఫిర్యాదు చేశారు. ఆలయంలో భక్తుల రక్తం చిందిన నేపథ్యంలో ఆలయాన్ని కొంతసేపు మూసేసి.. పరిహార పూజ చేసిన తర్వాత తిరిగి ఓపెన్ చేశారు. ఈ మొత్తం ఉదంతం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్ కావటం.. డీఎంకే ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాల్ని అమలు చేస్తుందని.. స్టాలిన్ సర్కారుకు హిందూ ధర్మంపై నమ్మకం లేదంటూ మండిపడ్డారు. భక్తులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు బీజేపీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతంపై ఏపీ బీజేపీ నేతలు స్పందిస్తూ.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.