Begin typing your search above and press return to search.

15 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు!

ఒకవేళ బీజేపీకి సొంతంగా సీట్లు తగ్గినా మిత్ర పక్షాల మద్దతుతో అధికారంలోకి రావొచ్చని విశ్వసిస్తోంది.

By:  Tupaki Desk   |   7 March 2024 1:30 PM GMT
15 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు!
X

త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)లో వీలైనన్ని పార్టీలను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఒకవేళ బీజేపీకి సొంతంగా సీట్లు తగ్గినా మిత్ర పక్షాల మద్దతుతో అధికారంలోకి రావొచ్చని విశ్వసిస్తోంది.

ఈ నేపథ్యంలో కొత్త భాగస్వామ్య పక్షాల కోసం చూస్తున్న బీజేపీకి భారతదేశ తూర్పు తీరంలో పొత్తుకు వీలు కుదిరింది. పశ్చిమ బెంగాల్‌ లో మమతా బెనర్జీ వల్ల బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే ప్రమాదం ఉండటంతో.. దాని పొరుగు రాష్ట్రం ఒడిశాపై బీజేపీ కన్నేసింది. ఇందులో భాగంగా ఒడిశాలో గత 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ (బీజేడీ)తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది.

బీజేపీ, బీజేడీ పొత్తుపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. అయితే ఇరు పార్టీల నేతలు మాత్రం దీనిపై సంకేతాలు ఇస్తున్నారు. ఒడిశాలో 21 లోక్‌ సభా స్థానాలు ఉన్నాయి. పొత్తుపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పార్టీ నేతలతో ఒడిశాలో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు సైతం ఢిల్లీలో పొత్తుపై భేటీ నిర్వహించారు.

బీజేడీ సమావేశం తర్వాత ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పొత్తుపై సంకేతాలిచ్చారు. బీజేపీతో పొత్తు గురించి ముఖ్యమంత్రి చర్చించారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతోపాటు రాష్ట్రంలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగిందని చెప్పారు.

ఒడిశాలో 21 లోక్‌ సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాయి. ఇక అసెంబ్లీలో బీజేడీకి 112, బీజేపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో పొత్తు ఖాయమైతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 9 ఎంపీ సీట్లు, 55 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేడీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా గతంలో సీట్ల పంపకం చర్చలు విఫలమవడంతో 11 ఏళ్ల పాటు మిత్రపక్షంగా ఉన్న బీజేడీ 2009లో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగింది. మళ్లీ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఎన్డీయే కూటమిలో చేరడానికి మొగ్గు చూపుతోంది.

1998లో బీజేడీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ ఏడాది జరిగిన లోక్‌ సభ ఎన్నికలతోపాటు 1999, 2004 లోక్‌ సభ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఆ తర్వాత 2009 ఎన్నికల నాటికి ఎన్డీయే నుంచి వైదొలగింది. మళ్లీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత కలిసి పోటీ చేయబోతున్నాయి.