అమెరికాలో సె*క్స్ కుంభకోణం... ఎప్ స్టీన్ ఫైల్స్ గురించి తెలుసా?
అవును... ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన దారుణాలు, అతనితో కలిసి పలువురు ‘పెద్దలు’ చేసిన ‘పనుల’ సంకలనమే ఎప్ స్టీన్ ఫైల్స్!
By: Tupaki Desk | 17 July 2025 8:00 PM ISTఎప్ స్టీన్ ఫైల్స్... అమెరికాను కుదిపేసి ఇప్పటికీ కుదిపేస్తూ వార్తల్లో ట్రెండింగ్ లో ఉంటున్న సె*క్స్ కుంభకోణం! ఈ ఎప్ స్టీన్ ఫైల్స్ ని ట్రంప్.. పైకి “బోరింగ్ స్టఫ్” అని అంటున్నా.. అందులో ఏ స్థాయి స్టఫ్ ఉందో, ఎంతోమంది 'పెద్దల' చీకటి కోణం దాగి ఉందనే విషయం ఆయనకు తెలియంది కాదు! ఈ క్రమంలో దీనిపై అమెరికాలో మరోసారి బలమైన చర్చ మొదలైంది.
అవును... ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన దారుణాలు, అతనితో కలిసి పలువురు ‘పెద్దలు’ చేసిన ‘పనుల’ సంకలనమే ఎప్ స్టీన్ ఫైల్స్! పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి.. వర్జిన్ ఐలాండ్స్, ఫ్లోరిడా, న్యూయార్క్, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ఈ కేసులో జెఫ్రీ ఎప్ స్టీన్ పై ఉన్న ప్రధాన ఆరోపణ!
ఈ విధంగా తన చేతిలో అఘాయిత్యాలకు బలైన బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని తన వద్దకు తీసుకొస్తే ఇంకొంత కమిషన్ ఇస్తానని ఆశ చూపేవాడట ఎప్ స్టీన్! ఇలా చైన్ సిస్టమ్ తరహాలో ఇతడి దారుణాలు జరిగేవని అప్పట్లో బయటపడింది. ఈ క్రమంలో సుమారు రెండు దశాబ్ధాల పాటు ఈ చీకటి వ్యవహారం జరిగింది.
ఈ క్రమంలో... 2006లో ఫ్లోరిడాలోని తన ఇంట్లో 14 ఏళ్ల తమ కుమార్తెను లైంగికంగా వేధించాడంటూ ఆమె తల్లితండ్రులు పోలీసులకు చెప్పడంతో.. అమెరికన్ రిచ్చెస్ట్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్ స్టీన్ పై తొలిసారిగా లైంగిక నేరాల అభియోగం మోపబడింది. ఆ కేసులో అతడికి 13 నెలల కంటే తక్కువ కాలం జైలు శిక్ష విధించబడింది.
అక్కడితో ఎప్ స్టీన్ ఏమీ మారిపోలేదు. 2019లో మైనర్ బాలికలతో సెక్స్ ర్యాకెట్ కేసులో న్యూయార్క్ లో మరోసారి దొరికాడు. ఈ సమయంలో.. డజన్ల కొద్దీ టీనేజ్ బాలికలను అక్రమంగా రవాణా చేసి, డబ్బు కోసం వారితో లైంగిక చర్యలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఇందులో అతని ఉద్యోగులు, సహచరులు, స్నేహితులు ఉన్నట్లు తెలిపారు!
2019 ఆగస్టు 10న విచారణ నిమిత్తం కస్టడీలో ఉండగా.. ఎప్ స్టీన్ తన జైలు గదిలో ఉరి వేసుకుని చనిపోయాడని అధికారులు తెలిపారు. అయితే... అతని ఫైల్స్ లో ఎంతో మంది ప్రముఖులు ఉండటంతో, వారి పేర్లు బయటకు వస్తాయనే ఆందోళనలో భాగంగా ఇతడిని జైల్లోనే మట్టుబెట్టారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే.. అది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు.
ఇదే సమయంలో... ఎప్ స్టీన్ స్నేహితురాలు గిస్లైన్ మాక్స్వెల్ పైనా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కేసు నమోదు అయింది. ఇందులో భాగంగా... ఆమె బాలికల జీవితాలను నాశనం చేయడంలో సహాయం చేసిందని 2022లో జైలు శిక్ష అనుభవించింది. బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ, మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులతో ఎప్ స్టీన్ కున్న సంబంధాలను ఆమె వివరించింది.
ఈ క్రమంలో... 2024 ఎన్నికల ప్రచారంలో ఎప్ స్టీన్ ఫైల్స్ బయటపెడతానంటూ ట్రంప్ తన ప్రచారంలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. అది ఇప్పుడు అంత ముఖ్యమైన విషయం కాదన్నట్లుగా స్పందిస్తున్నారు. దీంతో... మరిన్ని సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఆ ఫైల్స్ లో ట్రంప్ బ్యాచ్ ఎవరైనా ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ట్రంప్ తో సహా అతనితో సంబంధం ఉన్న ధనవంతులు, శక్తివంతమైన ఉన్నత వర్గాల వారిని రక్షించడానికి అధికారులు ఎప్ స్టీన్ కేసు గురించి వివరాలను దాచిపెడుతున్నారని పలువురు బలంగా నమ్ముతున్నారు.
వాస్తవానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లుగా జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన దారుణానికి సంబంధించి కీలక పత్రాలను ఈ ఏడాది ఫిబ్రవరి 27న అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ విడుదల చేసింది. దీనికి "ది ఎప్ స్టీన్ ఫైల్స్: ఫేజ్ 1" అని నామకరణం చేసింది. అయితే... ఇందులో చాలా తక్కువ సమాచారం ఉందని.. జనాలను ఏమార్చే ప్రయత్నంగా దీన్ని విడుదల చేశారనే చర్చ నడించింది.
అయితే ఈ విషయంపై ట్రంప్ ఇంక సైలెంట్ అయిపోయారు. దీనిపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై... ఎప్ స్టీన్ ఫైల్స్ పేరుతో తన పరిపాలనా యంత్రాంగంపై దాడి చేయవద్దని మండిపడుతున్నారు. ఎప్ స్టీన్ క్లయింట్ల జాబితాను దాచినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసినా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. దీనితో డెమోక్రాట్లు రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తున్నారని ఆరోపించారు.
దీంతో... ఇక ఈ విషయంపై ట్రంప్ నుంచి ఇంతకు మించిన రియాక్షన్ రాకపోవచ్చనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై ప్రపంచానికి మరిన్ని విషయాలు తెలియాలంటే... ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు, నిఘా వ్యవస్థల లీకులతో ఎవరైనా హాలీవుడ్ డైరెక్టర్ రంగంలోకి దిగాలని అంటున్నారు. అంతే తప్ప.. దీనిపై ట్రంప్ నుంచి ఇంక అంచనాలు వృథా అని చెబుతున్నారు.
