Begin typing your search above and press return to search.

రూ.15 వేలు కాదు రూ.13 వేలే.. తల్లికి వందనంలో రూ.2 వేలు కోత ఎందుకంటే...

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికివందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.13 వేల చొప్పున జమ చేయనుంది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 9:36 AM
రూ.15 వేలు కాదు రూ.13 వేలే.. తల్లికి వందనంలో రూ.2 వేలు కోత ఎందుకంటే...
X

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికివందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.13 వేల చొప్పున జమ చేయనుంది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఎన్నికల హామీ ప్రకారం విద్యార్థుల తల్లుల అకౌంటులో రూ.15 వేలు చొప్పున జమ చేయాల్సివుంది. అయితే రూ.15 వేల చొప్పున విడుదల చేస్తున్నప్పటికీ అందులో రూ.2 వేలు చొప్పున కోత విధించి, ఈ మొత్తం పాఠశాలల అభివృద్ధి నిధికి మళ్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం కింద గురువారం డబ్బులు జమ కానున్నాయి. అయితే ప్రభుత్వం ముందు చెప్పినట్లుగా రూ.15 వేలు కాకుండా, రూ.2 వేలు తగ్గించి రూ.13 వేలు చొప్పున చెల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఇలానే రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.2 వేలు చొప్పున కోత విధించిందని, ఎన్నికల సమయంలో కోతలు లేకుండా రూ.15 వేలు ఇస్తామని చెప్పి, కూటమి ప్రభుత్వం కూడా రూ.13 వేలే ఇస్తాననడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.13 వేలు చొప్పున నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల 69 వేల 459 మంది తల్లుల అకౌంట్లకు ఈ రోజు డబ్బులు జమ చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులు అర్హులుగా గుర్తించినట్లు చెప్పింది. ఒకటి, 11 లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరనున్న విద్యార్థులకు తర్వాత డబ్బులు జమ చేయనుంది. ఈ రోజు తల్లికివందనం డబ్బులు జమ చేసేందుకు గాను రూ.8,745 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

కోత విధించిన రూ.2 వేలులో రూ.వెయ్యి పాఠశాలల మరుగుదొడ్ల నిధికి మరో రూ.వెయ్యి పాఠశాలల నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం ఆయా జిల్లా కలెక్టర్ల అకౌంటులో జమ చేయనున్నారు. బుధవారం తల్లికి వందనం కార్యక్రమంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి, నిధులు విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు.