ఆదిలోనే అడుసులో కాలు..? ఎన్డీఏలోకి తమిళ విజయ్ పార్టీ
ఈ క్రమంలోనే కరుణానిది, ఎంజీ రామచంద్రన్, విజయ్ కాంత్, కమల హాసన్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారు
By: Tupaki Desk | 21 April 2025 10:00 PM ISTరాజకీయాల్లోకి రావడం వేరు.. కొత్త రాజకీయ పార్టీ పెట్టడం వేరు.. గెలుపు ఓటములు ఎదురైనా నిలదొక్కుకోవడం వేరు.. ఇక నేరుగా అధికారంలోకి రావడం వేరు.. తమిళనాడులో, తెలుగు నాట కూడా ఎన్నో పార్టీలు పుట్టాయి.. గిట్టాయి.. కాలక్రమంలో నిలిచినవే అధికారం చేపట్టాయి.
సినీ రంగం-రాజకీయాలు చాలా దగ్గర సంబంధాలు ఉన్నవి. మరీ ముఖ్యంగా తమిళనాడులో. ఈ క్రమంలోనే కరుణానిది, ఎంజీ రామచంద్రన్, విజయ్ కాంత్, కమల హాసన్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారు. గత ఏడాది వీరి బాటలోనే తమిళగ వెట్రి కళగం (టీవీకే) అంటూ పార్టీని పెట్టారు నటడు తలపతి విజయ్.
ఓ హీరోగా విజయ్ స్టార్ డమ్ ఎవరికీ అందనిది. అలాంటి వాడు రాజకీయాల్లోకి రావడంతో తమిళనాట మార్పు ఖాయం అనిపించింది. ప్రజల్లోనూ మంచి స్పందన కనిపిస్తోంది. అయితే, తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీ టీవీకే.. తమిళనాట ఎన్డీఏ కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గత వారం అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పడు కొత్తపార్టీ టీవీకే కూడా వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. విజయ్ త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తారని అనంతరమే ఏ పార్టీతో వెళ్లాలనేది నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఎన్డీఏలోకి వెళ్తారని, అనంతరం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని పేర్కొంటున్నారు. దీనిపై విజయ్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
స్టాలిన్ నెత్తిన పాలు పోసినట్లే..
విజయ్ సొంతంగా పోటీ చేస్తేనే బెటర్. లేదా ఎన్డీఏ గూటికి చేరితే డీఎంకే సారథ్యంలోని కూటమి నెత్తిన పాలు పోసినట్లే. ఇప్పటికీ తమిళనాడులో బీజేపీకి పట్టు లేదు. ఆ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లిన అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం తెలంగాణలో బండి సంజయ్ ను తప్పించడం రెండూ ఒకటే. బీజేపీని హిందీ పార్టీగా చాలామంది తమిళులు భావిస్తున్నారు. ఈ వ్యతిరేకతను స్టాలిన్ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
