Begin typing your search above and press return to search.

దళపతి అసలైన పొలిటికల్ హీరో!

అయితే కాలగమనంలో అన్నాడీఎంకే ద్రవిడ వాదం కొంత పలుచబడింది అన్న విమర్శలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   5 July 2025 8:00 AM IST
దళపతి అసలైన పొలిటికల్ హీరో!
X

రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించిన దగ్గర నుంచి తమిళ స్టార్ దళపతి విజయ్ ఆలోచనలు యాక్షన్ ప్లాన్ విభిన్నంగా ఉన్నాయి. ఆయన పార్టీ పేరు, రంగులు ఇలా ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతే కాదు ఏ జిల్లాలో మీటింగ్ పెట్టాలి అక్కడ ఏమి మాట్లాడాలి అన్నది కూడా ఆయన ఆచీతూచీ నిర్ణయం తీసుకుంటున్నారు.

వీటి కంటే ముందు తన పార్టీ పొలిటికల్ ఫిలాసఫీ ఇదీ అని ఆయన కచ్చితంగా చెబుతున్నారు. దానికి తాను కట్టుబడి ఉంటాను అని అంటున్నారు. ద్రవిడ వాదాన్ని విజయ్ తన పార్టీ అజెండాగా చేసుకున్నారు. తమిళనాట ఈ వాదం బలంగా ఉంటుంది. రాజకీయాల్లో అది ఇంధనంగా పనిచేస్తుంది. ఈ వాదంతో రెండు పార్టీలు ఇప్పటికే ఉన్నాయి. డీఎంకే అన్నా డీఎంకే ఇదే వాదం మీద మాట్లాడుతూ ఉంటాయి.

అయితే కాలగమనంలో అన్నాడీఎంకే ద్రవిడ వాదం కొంత పలుచబడింది అన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో డీఎంకే కూడా ద్రవిడవాదం నుంచి సైడ్ అవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో మళ్ళీ మళ్ళీ గట్టిగా గొంతు సవరించుకుంటోంది. ఈ మధ్యకాలంలో ధాటీగా ద్రవిడవాదాన్ని వినిపిస్తోంది.

అయితే విజయ్ పార్టీ మాత్రం ఏ మాత్రం రాజీలేని ద్రవిడ వాదం తమదని చెబుతోంది. దశాబ్దాలుగా అధికారంలో ఉంటూ రాజకీయ మనుగడ సాగిస్తున్న డీఎంకే అన్నా డీఎంకే పార్టీలను తన సిద్ధాంత బలంతోనే కొట్టాలని విజయ్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

మరో వైపు చూస్తే బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంది. దానిని అవకాశంగా తీసుకుని మతతత్వ పార్టీలతో పొత్తు ఉండదని విజయ్ అంటున్నారు. అంతే కాదు అటు కాంగ్రెస్ తో కానీ ఇటు బీజేపీతో కానీ ప్రత్యక్ష పరోక్షంగా పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. తమ పార్టీ అజెండా పూర్తిగా తమిళనాడు కోసమే అని స్పష్టం చేశారు.

మరో వైపు చూస్తే విజయ్ కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తల చేత వేరే పార్టీ జెండాను మోయించమని కచ్చితంగా చెప్పారు. దాంతో విజయ్ చేసిన వ్య్హాఖ్యల పట్ల పార్టీ క్యాడర్ పూర్తి హర్షం వ్యక్తం చేస్తోంది. సీఎం గా విజయ్ ని చూడాలని ఆయన అభిమానులుగా ఉన్న వారు అంతా కార్యకర్తలుగా టర్న్ అయ్యారు. అంతే కాదు మొత్తం తమిళనాడులో అంతటా విజయ్ పార్టీ టీవీకే పోటీ చేయాలని అనుకుంటున్నారు.

అందుకే వారి మాటే తన బాట అని దళపతి క్లారిటీ ఇచ్చేశారు. నిజంగా ఆయన చెప్పినది గొప్ప మాట అని అంటున్నారు. ఆ మాట అనడానికి ఎంతో గట్స్ ఉండాలని అంటున్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన రెండు పార్టీలు డీఎంకే అన్నా డీఎంకే ఉన్నాయి. ఇక అన్నాడీఎంకే అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంది. డీఎంకే కాంగ్రెస్ తో పొత్తులో ఉంది. ఇలా బలమైన కూటములను ఎదిరించాలంటే సత్తా ఉండాలి.

వాటికి తరతరాలుగా ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది. మందీ మార్బలం ఉంది. అంతే కాదు రాజకీయంగా విశేష అనుభవం ఉంది. కానీ విజయ్ పార్టీ తొలి ప్రయత్నంతోనే తమ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోంది. హీరో అంటే హీరోనే అది రీల్ లో అయినా రియల్ లో అయినా అని ఈ ఒక్క స్టేట్మెంట్ తో విజయ్ నిరూపించారు అని అంటున్నారు. తన పార్టీ గెలవాలి. తన క్యాడర్ బాగుండాలి. వారు సొంత జెండా మోయాలి తప్ప మరోటి కాదు అన్నది నిజమైన నాయకుడి లక్షణం అంటున్నారు.

తమిళనాడులో త్రిముఖ పోరు సాగితే ఓట్లు చీలి డీఎంకే గెలుస్తుంది అన్న మాట ఆయన అనలేదు. ఒక పార్టీని ఓడించాలన్న జీవిత కాలం లక్ష్యం పెట్టుకోలేదు. మరో పార్టీని దశాబ్దాలుగా మోస్తామని చెప్పడం లేదు పార్టీ ఎందుకు పెట్టామో ఆ లక్ష్యాలను సొంతంగా ప్రజల మద్దతు సాధిస్తామని అంటున్నారు. తాను కచ్చితంగా గెలవాలని అనుకుంటున్నారు. ఇదే కదా నిజమైన హీరోఇజం అని అంటున్నారు. మొత్తానికి మొదటి స్టెప్ లోనే విజయ్ క్యాడర్ మనసు గెలిచారు. ఇంట గెలిచిన ఆయన జనం మనసు కూడా గెలిస్తే కాబోయే సీఎం ఆయనే అని అంటున్నారు అంతా.