Begin typing your search above and press return to search.

హిందూ విలువలను గొప్పగా చెప్పిన థాయ్ లాండ్ ప్రధాని

హిందూ విలువలతోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని థాయ్ లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు అశాంతితో ప్రపంచం పోరాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 2:30 AM GMT
హిందూ విలువలను గొప్పగా చెప్పిన థాయ్ లాండ్ ప్రధాని
X

హిందూ విలువలు చాలా గొప్పవి అని మనం చెప్పుకోవడం కాదు ఇతర దేశాల వారు పొగడడంలోనే దాని విలువ గౌరవం ఎంతటివో అర్ధం అవుతుంది. హిందూ విలువలలో ఆధిపత్యం అన్న దానికి ఎక్కడా తావు లేదు. అందరితో సామరస్యం ఉంది. అందులోనే మనం అన్న ఉత్తమ భావన ఉంది. అందరూ ఉంటేనే సమాజం అన్న నీతి ఉంది. ఒకరికి ఒకరు అలా అందరూ కలిస్తేనే మానవాళి అన్న జీవన రీతి ఉంది.

ఇపుడు ప్రపంచం మొత్తం అహింసతో నిండిపోతోంది. ఎక్కడ చూసినా ఒకరితో ఒకరికి పొడ గిట్టడంలేదు. వారి మీద వీరు ఆధిపత్యం వీరి మీద వారు కత్తులు దూసుకునే వైనం. ఒక వైపు రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నిరాటకంగా దాదాపుగా రెండేళ్ళుగా సాగుతుంటే ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనా అన్నట్లుగా మరో వార్ కి తెర లేచింది.

ఇతర దేశాల విషయం చెప్పాల్సింది లేదు అన్న వస్త్రాల గురించి ఎవరూ ఆలోచన చేయకుండా అణ్వస్త్రాలే గొప్పవి అని అవి ఉంటే తామే ప్రపంచ విజేత అని ఆయుధాలను గుట్టలుగా పోగేసుకుని వాటి మీద కూర్చునే ప్రపంచ పెత్తందారుల పోకడలు కనిపిస్తున్నాయి.

ఈ సంక్లిష్ట పరిస్థితులల్లో శాంతి కోరుకునే వారు విలవిలలాడుతున్నారు. ఏ పాపం చేయని వారు ఏ నేరమూ చేయని వారు మధ్యన పడి నలుగుతున్నారు. అత్యధిక దేశాలు శాంతి బాటలో నడవాలనే చూస్తున్నాయి. కానీ కుదరడంలేదు. ఈ నేపధ్యంలో థాయ్ లాండ్ ప్రధాని ప్రపంచానికి ఒక ఉత్తమోత్తమమైన సందేశాన్ని పంపించారు.

హిందూ విలువలతోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని థాయ్ లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్ అభిప్రాయపడ్డారు. ఈ రోజు అశాంతితో ప్రపంచం పోరాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అహింస, సత్యం, సహనం, సామరస్యం వంటి వాటిని హిందూ విలువల నుంచి తీసుకోవాలని ఆయన సూచించారు. అంతే కాదు హిందూ విలువల నుంచి ప్రతీ దేశం ప్రేరణ పొందాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

అలా జరిగిన నాడే ప్రపంచంలో శాంతి సామరస్యం నెలకొంటుందని ఆయన అంటున్నారు. ఇక థాయ్ లాండ్ లో హిందూ ధర్మ సూత్రాలు విలువలపై నిర్వహించిన ప్రపంచ హిందూ మహా సభలకు థాయ్ లాండ్ వేదిక కావడం ఆనందకరం అన్నారు. తాము ఆతీధ్యం ఇవ్వడం కూడా గర్వకారణం అని ఆయన చెప్పడం విశేషం.

థాయ్ లాండ్ ప్రధాని చెప్పారని కాదు భారత్ శాంతి వెనక హిందూ విలువలు ఉన్నాయి. భారత్ తన చరిత్రలో ఏ దేశం పట్ల ద్వేషంగా వ్యవహరించలేదు. కోరి ఏ దేశం మీద తానుగా దాడి చేయలేదు. శాంతిని భారత్ కోరుకుంది. అంతే కాదు సామరస్యాన్ని కూడా కోరుకుంది. ప్రపంచం అంతా సోదర భావంతో ఉండాలని విశ్వ మానవాళి మేలు క్షేమం తమ లక్ష్యమని భారత్ అనడం వెనక హిందూ విలువలు నేర్పించిన పాఠాలు ఉన్నాయి.

ఇపుడు ప్రపంచానికి ఇదే గొప్ప మార్గదర్శకం కావాల్సిన అవసరం ఉంది. థాయ్ లాండ్ ప్రధాని ఇచ్చిన పిలుపు మిగిలిన దేశాధిపతులకు కూడా మేలు కొలుపు కావాలని అంటున్నారు. మానవాళి హాయిగా జీవించగలిగేది ఈ భూమి మీదనే. పచ్చని భూమిని తమదైన విద్వేషంతో ఆధిపత్యం తో హింసా ప్రవృత్తులతో పాడు చేసుకోవడం అన్నది ఎవరికీ తగదు. అదే థాయ్ లాండ్ ప్రధాని ఇచ్చిన సందేశం. దాన్ని పాటిస్తే ప్రతీ దేశం మరో భారత్ అవుతుంది. అపుడు ప్రపంచ శాంతి ఎల్లెడలా వెల్లి విరుస్తుంది.