థాయిలాండ్ స్కూల్లో కాల్పుల కలకలం... తాజా అప్ డేట్ ఇదిగో!
బంగారు భవిష్యత్తును ఆకాంక్షిస్తూ, విద్యాబుద్ధులు నేర్చుకుంటారని నమ్ముతూ తల్లితండ్రులు తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా స్కూల్స్ కి పంపుతుంటే..
By: Raja Ch | 11 Feb 2026 10:55 PM ISTబంగారు భవిష్యత్తును ఆకాంక్షిస్తూ, విద్యాబుద్ధులు నేర్చుకుంటారని నమ్ముతూ తల్లితండ్రులు తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా స్కూల్స్ కి పంపుతుంటే.. అక్కడ పలువురు దుండగులు జరిపే కాల్పుల్లో వారు గాయపడటం, మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతూ, వారి జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం కెనడాలోని స్కూల్ లో కాల్పులు కలకలం రేపగా.. తాజాగా థాయిలాండ్ స్కూల్ లోనూ తుపాకీ పేలింది!
అవును... బుధవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:45 గంటల ప్రంతంలో థాయిలాండ్ లోని ఓ స్కూల్ లో ఒక యువకుడు జరిపిన కాల్పుల్లో ఆ పాఠశాల డైరెక్టర్ మరణించగా.. ఒక విద్యార్థి సహా ఇద్దరు గాయపడ్డారు. తాజా సమాచారం ప్రకారం... కాల్పులు జరిపిన 18 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా... సాంగ్ఖా ప్రావిన్స్ లోని స్కూల్లో దుండగుడు అనేకసార్లు కాల్పులు జరిపాడని.. అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను బందీలుగా తీసుకున్నాడని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో కాల్పులకు కాల్పులకు పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో.. అతని వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి ఈ రోజు తరగతులు ముగిసిన కొద్ది సేపటికి సాంగ్ఖా ప్రావిన్స్ లోని పటోంగ్ ప్రతం క్రివాట్ స్కూల్ లోకి దుండగుడు వెళ్లినప్పుడు చాలా కోపంగా కనిపించాడని.. ఆ తర్వాత కాసేపటికి కొన్ని తుపాకీ కాల్పుల శబ్ధాలు వినిపించాయని స్థానిక పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.
కాగా... థాయిలాండ్ లో గన్ కల్చర్ రోజు రోజుకీ పెరుగుతుందని అంటున్నారు. స్మాల్ ఆరమ్స్ సర్వే అండ్ గన్ పాలసీ & ఆర్గ్ గ్రూపుల నుంచి సేకరించిన డేటా ప్రకారం థాయిలాండ్ లో ప్రతీ 100 మందిలో 10.3 తుపాకులు ఉన్నాయని.. ఈ క్రమంలో మొత్తం అక్రమ తుపాకీలను కలిపితే ప్రతీ 100 మందిలో సుమారు 15.1 మంది వద్ద తుపాకీ ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ గన్ కల్చర్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కాగా... 2020 ఫిబ్రవరిలో తన కాండింగ్ ఆఫీసర్ తో ఆర్థిక వివాదం కారణంగా థాయ్ సైనికుడు ఒకరు కాల్పులు జరపడంతో 29 మంది మృతి చెందగా డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఇక.. 2022 అక్టోబర్ లో ఉద్యోగం నుంచి తొలగించబడిన ఒక పోలీసు ఒక డే కేర్ సెంటర్ లో సుమారు 24 మంది చిన్నరులతో సహా 36 మందిని కాల్చి చంపాడు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా గన్ కల్చర్ విషయంలో సరైన సంస్కరణల దిశగా థాయ్ సర్కార్ చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
