Begin typing your search above and press return to search.

థాయిలాండ్‌ ను భయపెడుతున్న కొత్త ట్రెండ్...

పర్యాటక స్వర్గధామంగా పేరుగాంచిన థాయిలాండ్‌లో ఇటీవలి కాలంలో ఒక కొత్త ధోరణి ఉద్భవించింది.

By:  Tupaki Desk   |   9 Sept 2025 10:00 PM IST
థాయిలాండ్‌ ను భయపెడుతున్న కొత్త ట్రెండ్...
X

పర్యాటక స్వర్గధామంగా పేరుగాంచిన థాయిలాండ్‌లో ఇటీవలి కాలంలో ఒక కొత్త ధోరణి ఉద్భవించింది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో మహిళలు పర్యాటకులకు “అద్దె భార్యలు”గా అందుబాటులోకి వస్తున్నారు. వీరిని స్థానికంగా “సరోగసి భార్యలు” అని పిలుస్తున్నారు. తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకుని వంట చేయడం, ఇంటి పనులు చూసుకోవడం, భర్తలుగా వ్యవహరించే పర్యాటకులతో బయటికి వెళ్లడం వంటి బాధ్యతలను ఈ మహిళలు నిర్వరిస్తున్నారు. ఈ విధానం చట్టబద్ధం కాకపోయినా, ఆచరణలో కొనసాగుతోంది.

పేదరికమే కారణం?

ఈ పరిణామం వెనుక ఉన్న ప్రధాన కారణం పేదరికమే. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న మహిళలు తమ కుటుంబాల భారం తట్టుకోలేక ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒక్కో మహిళ కోసం నిర్ణయించే అద్దె విలువ వయస్సు, రూపం, చదువు, ఒప్పంద కాలం ఆధారంగా మారుతోంది. భారత కరెన్సీలో ఇది 1.4 లక్షల నుండి ఒక కోటి వరకు ఉంటుందని సమాచారం. తాత్కాలికంగా ఇది మహిళలకు ఉపాధి కలిగిస్తున్నా, దీని దీర్ఘకాల ప్రభావం సమాజానికి గణనీయమైన సవాళ్లను విసురుతోంది.

ఇక్కడ 'గర్ల్ ఫ్రెండ్ ఫర్ హైర్'

జపాన్, కొరియా వంటి దేశాల్లో “గర్ల్‌ఫ్రెండ్ ఫర్ హైర్” విధానం అందుబాటులో ఉంది. కానీ థాయిలాండ్‌లో “అద్దె భార్య” కల్చర్ కొత్తగా మొదలైంది. పర్యాటక ఆర్థిక వ్యవస్థకు ఇది లాభదాయకంగా కనిపించినా, దీని ఫలితాలు మానవ సంబంధాలు, కుటుంబ విలువలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యువతలో అనిశ్చితి

సమాజ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ ధోరణి కొనసాగితే సంబంధాలు వాణిజ్య లావాదేవీలుగా మారే ప్రమాదం ఉంది. వివాహం, కుటుంబం అనే విలువల పట్ల నిర్లక్ష్యం పెరిగి, యువతలో అనిశ్చితి భావం కలుగుతుంది. ముఖ్యంగా మహిళల గౌరవం, భద్రతపై దీని ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక ప్రయోజనాల కోసం మహిళల వ్యక్తిత్వాన్ని అద్దెకు ఇవ్వడం, లింగ సమానత్వ సూత్రాలకే విరుద్ధంగా మారుతుంది.

భవిష్యత్ కు ప్రమాదమే

ఈ నేపథ్యంలో థాయిలాండ్ ప్రభుత్వం, పౌర సమాజం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలన, మహిళలకు సముచిత ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యవసరం. లేకపోతే “అద్దె భార్యలు” అనే సంస్కృతి తాత్కాలిక పరిష్కారంలా కనిపించినా, దీని ప్రతికూల ప్రతిఫలం సమాజంపై దీర్ఘకాలంలో మరింత ప్రమాదకరంగా మారుతుంది.