బిగ్ బ్రేకింగ్... మొదలైన మరో యుద్ధం!
ఇటీవలే ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. మరోవైపు అవిరామంగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఇంకా అలానే ఉంది.
By: Tupaki Desk | 24 July 2025 1:12 PM ISTఇటీవలే ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. మరోవైపు అవిరామంగా కొనసాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఇంకా అలానే ఉంది. అటు ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం ఇంకా విస్తరిస్తోంది. ఈ సమయంలో తాజాగా మరో రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇందులో భాగంగా.. థాయిలాండ్, కంబోడియా సైనికులు సరిహద్దు ప్రాంతంలో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు.
అవును... థాయిలాండ్, కంబోడియా మధ్య వివాదాస్పద సరిహద్దులో మరోసారి పోరాటం చెలరేగింది. తిరిగి సైనిక చర్యలు మొదలయ్యాయి. ఈ రెండు దేశాలు 817 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... తాజాగా ల్యాండ్ మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడిన తర్వాత ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయని తెలుస్తోంది. దీంతో... ఈశాన్య సరిహద్దులు అన్నింటినీ థాయిలాండ్ మూసివేసింది.
ఈ సమయంలో... థాయ్ ఎఫ్-16 యుద్ధ విమానాలు కంబోడియాలోని లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు చెబుతున్నారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో... తమ సైనికులు డ్రోన్ లను గుర్తించిన తర్వాత తొలుత కంబోడియా దళాలు తమపై కాల్పులు జరిపాయని థాయ్ సైన్యం చెబుతుంది. మరోవైపు.. థాయ్ "సాయుధ దాడి" నుండి జాతీయ భూభాగాన్ని రక్షించుకుంటున్నాయని కంబోడియా పేర్కొంది.
ఈ నేపథ్యంలో... కంబోడియా నుంచి జరిగిన కాల్పుల కారణంగా కనీసం ఒక థాయ్ పౌరుడు మరణించగా, ఐదేళ్ల బాలుడు సహా ముగ్గురు గాయపడ్డారని థాయ్ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో... తమ ఏడుగురు సైనికులు గాయపడ్డారని కూడా థాయిలాండ్ నివేదించింది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన కంబోడియా రక్షణ మంత్రి... థాయ్ జెట్ లు కంబోడియా భూభాగంపై బాంబులు వేశాయని తెలిపారు.
కాగా... సుమారు 1,000 సంవత్సరాల పురాతనమైన ప్రీహ్ విహార్ ఆలయం చుట్టూ ఈ ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం ఈరోజు కొత్త కాదనే సంగతి తెలిసిందే. అంతర్జాతీయ న్యాయస్థానం 1962లో ఆలయాన్ని కంబోడియాకు అప్పగించింది. అయితే.. థాయ్ జాతీయవాద గ్రూపులు ఈ తీర్పును సవాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో 2011లో తాజా అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియా వాదనను పునరుద్ఘాటించింది.
అయినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇవి తాజాగా సాయుధ ఘర్షణలుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పేలుళ్లు వినిపిస్తుండటంతో ప్రజలు తమ ఇళ్ల నుండి పారిపోయి కాంక్రీట్ బంకర్ లో దాక్కుంటున్నట్లు థాయిలాండ్ మీడియా వెల్లడించింది!
