Begin typing your search above and press return to search.

కొంపముంచిన ఇన్‌స్టాగ్రామ్ స్నేహం.. హైదరాబాద్ చీకటి కూపంలో చిక్కుకున్న థాయ్ యువతి

ముప్పై సంవత్సరాల థాయ్ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తితో స్నేహం చేసింది. అతడిని నమ్మి చెన్నైకి వచ్చిన ఆమె జీవితం అధోగతి పాలైంది.

By:  Tupaki Desk   |   7 May 2025 12:00 AM IST
Thai Woman Lured into Prostitution After Falling Victim to Instagram Scam
X

హైదరాబాద్‌లో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ముప్పై సంవత్సరాల థాయ్ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తితో స్నేహం చేసింది. అతడిని నమ్మి చెన్నైకి వచ్చిన ఆమె జీవితం అధోగతి పాలైంది. ఆ వ్యక్తి ఆమెను మోసం చేశాడు. ఒక హోటల్ గదిలో అనేకసార్లు లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలి పరారయ్యాడు. హోటల్ అద్దె చెల్లించడానికి, తిరిగి తన దేశానికి డబ్బుల్లేని ఆ మహిళ నిస్సహాయ స్థితిలో వ్యభిచారం చేయాల్సి వచ్చింది. డబ్బు సంపాదించడానికి మరో దారి లేకపోవడంతో థాయ్ అమ్మాయిలను వ్యభిచారం కోసం సరఫరా చేసే ఒక వ్యక్తిని ఆమె ఆశ్రయించింది. ఆ వ్యక్తి ఆమెను, మరొక అమ్మాయిని శ్రీనగర్ కాలనీలోని ఒక ఫ్లాట్‌లో ఉంచి వ్యభిచారం చేయిస్తున్నాడు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. వారు ఆ ఫ్లాట్ మీద దాడి చేశారు. ఆ ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వెళ్లడానికి డబ్బు సంపాదించడానికే తాను వ్యభిచారంలోకి దిగానని ఆ థాయ్ యువతి పోలీసుల ఎదుట కన్నీటితో విలపించింది. దీంతో పోలీసులు ఆమెను పునరావాస గృహానికి తరలించారు. ఈ సంఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే మహిళలు కొందరు స్వార్థపరులైన పురుషులకు ఈజీ టార్గెట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మహిళలు, అమ్మాయిలు తెలిసో తెలియకో తమను ప్రేమించానని నమ్మించిన వారి మోసానికి బలవుతున్నారు. ఆ తర్వాత వ్యభిచార కూపంలోకి దిగవలసి వస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఏర్పడే స్నేహాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారుతాయో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది. ఆన్‌లైన్ స్నేహాల విషయంలో యువతులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు పంచుకునే ముందు అవతలి వ్యక్తి నేపథ్యం, ఉద్దేశాలను పూర్తిగా తెలుసుకోవాలని చెబుతున్నారు.

హైదరాబాద్ పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, వ్యభిచార రాకెట్‌ను నడుపుతున్న వ్యక్తిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బాధితులకు న్యాయం చేకూర్చగలమని.. ఇతరులకు ఇది ఒక గుణపాఠం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.