ఇన్ స్టాలో పరిచయం.. నమ్మి ఇండియాకు వస్తే ముంచేశాడు
ఆమెను చెన్నైకు రావాలని కోరటంతో నమ్మిన ఆమె వచ్చేసింది. చెన్నైలోని ఒక హోటల్ లో ఆమెను ఉంచి పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
By: Tupaki Desk | 6 May 2025 5:00 AM ISTఆన్ లైన్ స్నేహాలు అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. వాటిని నమ్మి వచ్చిన కొందరు ఎంత దారుణంగా మోసపోతారన్న దానికి నిదర్శనంగా కొన్ని ఉదంతాలు వెలుగు చూస్తుంటాయి. ఆ కోవలోకే చెందిన ఒక ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఇన్ స్టాలో పరిచయమై.. ఫ్రెండ్ కాస్తా ప్రేమికుడిగా మారిన వ్యక్తి కోసం భారత్ కు వచ్చిందో థాయిలాండ్ యువతి. చెన్నైకు చెందిన సదరు యువకుడితో ఆమెకు ఇన్ స్టాలో పరిచయమైంది.
ఆమెను చెన్నైకు రావాలని కోరటంతో నమ్మిన ఆమె వచ్చేసింది. చెన్నైలోని ఒక హోటల్ లో ఆమెను ఉంచి పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేయటం.. హోటల్ బిల్లును కట్టాలని యువతిని హోటల్ సిబ్బంది నిలదీశారు. దీంతో ఏం చేయాలో తోచని ఆమె.. థాయ్ లాండ్ కు వెళ్లేందుకు కూడా డబ్బుల్లేని పరిస్థితి.
దీంతో థాయ్ లోని ఒక ఫ్రెండ్ కు ఫోన్ చేయగా.. భారత్ కు థాయ్ మహిళల్ని పంపి వ్యభిచారం చేయించే ఒక ఆమెను పరిచయం చేసింది. ఆమె సదరు యువతిని హైదరాబాద్ కు పంపి.. వ్యభిచారంలోకి నెట్టింది. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఆమె పట్టుబడింది. డబ్బుల్లేక సొంత దేశానికి తిరిగి వెళ్లలేని తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచారం చేయాల్సి వచ్చినట్లుగా ఆమె చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి పునరావాస కేంద్రానికి తరలించారు.
