ఠాక్రే బ్రదర్స్ : ఉన్న దమ్ములు చూపిస్తారా ?
అంతే కాదు ఠాక్రే మార్క్ వ్యూహాలు కూడా రాజ్ కే ఎక్కువగా పట్టుబడ్డాయి. ఇక 1990 దశకంలో శివసేన ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
By: Tupaki Desk | 21 April 2025 4:00 AM ISTఆ ఇద్దరూ అన్నదమ్ములు. అంటే కజిన్స్ అన్న మాట. మహా రాజకీయాల్లో పెద్ద పులి లాంటి శివసేన అధినేత బాల్ థాక్రేకి మొదట వారసుడిగా ఆయన తమ్ముడి కొడుకు రాజ్ థాక్రే అని అంతా అనుకునేవారు. బాల్ థాక్రేని అచ్చుగుద్దినట్లుగా ఆయన అన్ని విషయాల్లో పోలి ఉండేవారు. ఠాక్రే డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటికల్ స్టైల్ రాజ్ థాక్రేకు వచ్చింది. అలాగే ఆయన ఆవేశపూరితమైన స్పీచులు అలాగే బాడీ లాంగ్వేజ్ ఆయన వేసే సెటైర్లు మరాఠీ భాష మీద పట్టు ఇవన్నీ రాజ్ కే ఎక్కువగా అబ్బాయి.
అంతే కాదు ఠాక్రే మార్క్ వ్యూహాలు కూడా రాజ్ కే ఎక్కువగా పట్టుబడ్డాయి. ఇక 1990 దశకంలో శివసేన ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆయనను వెన్నంటి రాజ్ థాక్రే ఉండేవారు. ఇదిలా ఉంటే సొంత కొడుకు ఉద్ధవ్ థాక్రే 1985 బృహన్ ముంబై ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
ఇక 2002లో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చారు. . 2003లో శివసేన అధినేత బాల్ ఠాక్రే ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. 2004లో శివసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అలా బాల్ థాక్రే తన సొంత కుమారుడు ఉద్ధవ్ థాక్రేకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయననే తన అసలైన వారసుడిగా ప్రకటించేశారు.
దాంతో రాజ్ కి బాల్ థాక్రేకి కొంత గ్యాప్ వచ్చింది. అలా 2005 నవంబరు 27న శివసేనకు రాజీనామా చేసి సొంత పార్టీని రాజ్ పెట్టుకున్నారు. దానికి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అని పేరు పెట్టుకున్నారు అయితే రాజ్ ఆ పార్టీ తరఫున పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అంతే కాదు చట్ట సభలకు సైతం తాను ఒక్కడిగా కూడా గెలవలేకపోయారు. ఎంతో బలమైన నాయకుడిగా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కనిపించిన రాజ్ థాక్రే ఇప్పటిదాకా చట్ట సభలలో కాలు మోప లేకపోయారు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
ఆయన కంటే వెనక వచ్చిన ఉద్ధవ్ థాక్రే ఏకంగా సీఎం గా కూడా అయిపోయారు. ఇదిలా ఉంటే ఉద్ధవ్ థాక్రే తన వారసుడిగా బాల్ థాక్రే నిర్ధారించారు. దాంతో శివసేన యావత్తూ ఆయన వెంట నడిచింది. అయితే 2019 నుంచి 2022 మధ్యలో ఏక్ నాధ్ షిండే శివసేనను చీల్చేశారు. ఆయన పవర్ ఫుల్ మాస్ లీడర్. దాంతో శివసేన డీలా పడింది. తగిన వ్యూహాలు లేక 2024 లోక్ సభ ఎన్నికల్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది.
ఈ నేపధంలో రాజ్ థాక్రే ఉద్ధవ్ థాక్రే ఇద్దరూ కలిసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. మహారాష్ట్రలో హిందీ భాషను రుద్దుతామని అంటే తాము వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. శివసేన మరాఠీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఒక్క అంశమే ఈ ఇద్దరినీ కలపబోతోంది అని అంటున్నారు.
తమ మధ్య ఉన్నవి చిన్న అభిప్రాయ విభేదాలే అని రాజ్ అంటున్నారు. ఉద్ధవ్ కూడా రాజ్ తో జత కలిసేందుకు ఓకే అంటున్నారు. ఇలా థాక్రే బ్రదర్స్ చేతులు కలుపుతున్నారు. ఇది రానున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో శివసేనని గెలిపించేందుకే అని అంటున్నారు. అంతే కాదు శివసేనలో ఏక్ నాధ్ షిండే వెళ్ళిపోయాక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ లేకుండా పోయారు. రాజ్ కనుక వస్తే ఆ లోటు తీరుతుందని అంటున్నారు.
మరి ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిస్తే కనుక శివసేనకు రాజకీయంగా లాభం ఉంటుందని అంటున్నారు. మిత్రులు అయిన కాంగ్రెస్ శరద్ పవార్ ఎన్సీపీ థాక్రే బ్రదర్స్ ఒక్కటి కావాలని కోరుకుంటున్నాయి. బీజేపీ కూడా వారిద్దరి కలయికకు ఓకే చెబుతూ ఎవరు కలసినా మహారాష్ట్రలో తమదే ప్రతీ ఎన్నికలోనూ విజయం అని అంటోంది. మొత్తం మీద చూస్తే ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఉన్న దమ్ములు చూపించబోతున్నారుట. ఈ ఇద్దరూ కలిసేది ఎపుడూ ఏమిటి అన్నది తొందరలో తెలుస్తుంది.
