Begin typing your search above and press return to search.

క్రికెట్ లీగ్‌ల నిర్వహణ నియ‌మాలు.. విజ‌య్‌ దేవ‌ర‌కొండ ఎర‌క్క‌పోయి..!

సాధారణంగా గల్లీల్లో ఆడే స్థానిక టోర్నమెంట్‌లకు లేదా వినోదం కోసం ఆడే ఫ్రెండ్లీ మ్యాచ్‌లకు బీసీసీఐ లేదా టీసీఏ అనుమతితో పనిలేక‌పోయినా.. విజయ్ దేవరకొండ

By:  Sivaji Kontham   |   18 Jun 2026 12:00 PM IST
క్రికెట్ లీగ్‌ల నిర్వహణ నియ‌మాలు.. విజ‌య్‌ దేవ‌ర‌కొండ ఎర‌క్క‌పోయి..!
X

భారతదేశంలో అధికారికంగా క్రికెట్ మ్యాచ్‌లు లేదా వాణిజ్యపరమైన టోర్నమెంట్‌లను నిర్వహించడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగ‌ల‌దా? అంటే అది సాధ్యం కానిది. క‌చ్చితంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠినమైన నిబంధనలు, మార్గదర్శకాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం... ఏ రాష్ట్ర క్రికెట్ సంస్థ అయినా ఒక కమర్షియల్ టి20 లీగ్‌ను ప్రారంభించాలనుకుంటే, దానికి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ (ఏజీఎం) ద్వారా ఎన్నికైన పూర్తి స్థాయి గవర్నింగ్ కౌన్సిల్ ఉండాలి. టోర్నమెంట్‌కు కనీసం 45 రోజుల ముందే బీసీసీఐ నుండి రాతపూర్వక అనుమతి పొందడం తప్పనిసరి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) వంటి ప్రాంతీయ బోర్డులు ఈ నిబంధనల ఉల్లంఘనలపై నిఘా ఉంచుతాయి కాబట్టి హెచ్‌సీఏ బీసీసీఐ అనుమతి లేకుండా ఏకపక్షంగా లేదా స్వతంత్రంగా వాణిజ్య లీగ్‌లను నిర్వహించే హక్కును కలిగి లేదు.

అనధికారిక లీగ్‌ల నిర్వహణ వల్ల స్థానిక క్రీడాకారుల కెరీర్‌కు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఒకవేళ హెచ్‌సీఏ లేదా మరేదైనా సంస్థ బీసీసీఐ ఆమోదం లేకుండా టోర్నమెంట్‌లను నిర్వహిస్తే.. అది క్రికెట్ వాతావరణంలో చట్టపరమైన, నిర్మాణాత్మకమైన గందరగోళానికి దారితీస్తుంది. బీసీసీఐ గుర్తింపు లేని ఇటువంటి లీగ్‌లలో ఆడే యువ ఆటగాళ్లు భవిష్యత్తులో అధికారిక బోర్డు మ్యాచ్‌లకు, రంజీ ట్రోఫీలకు లేదా జాతీయ జట్టుకు ఎంపికయ్యే అర్హతను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కార్పొరేట్ స్పాన్సర్లు , సెలబ్రిటీలు ఇటువంటి అనధికారిక లీగ్‌లకు దూరంగా ఉండాలని... వాటితో ఉన్న సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని బోర్డులు డిమాండ్ చేస్తుంటాయి.

సాధారణంగా గల్లీల్లో ఆడే స్థానిక టోర్నమెంట్‌లకు లేదా వినోదం కోసం ఆడే ఫ్రెండ్లీ మ్యాచ్‌లకు బీసీసీఐ లేదా టీసీఏ అనుమతితో పనిలేక‌పోయినా.. విజయ్ దేవరకొండ, మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సెలబ్రిటీలు, ప్రొఫెషనల్ క్రీడాకారులు వాణిజ్యపరమైన లీగ్‌లను ప్లాన్ చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే బీసీసీఐ ఆధ్వర్యంలో ఆడే సిరాజ్, తిలక్ వర్మ వంటి కాంట్రాక్ట్ క్రీడాకారులు బోర్డు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అనుమతి లేని లీగ్‌లను ప్రమోట్ చేస్తే వారు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ వారు కేవలం చారిటీ లేదా ప్రైవేట్ వినోదం కోసం ఎలాంటి వాణిజ్య ప్రయోజనాలు, ప్రొఫెషనల్ ప్లేయర్ల ప్రమేయం లేకుండా టోర్నమెంట్ ప్లాన్ చేస్తే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు గానీ... పెద్ద ఎత్తున కమర్షియల్ లీగ్‌లను ప్రమోట్ చేయాలంటే మాత్రం క‌చ్చితంగా క్రికెట్ బోర్డుల అధికారిక అనుమతి ఉండాల్సిందే. దీని అర్థం.. జాతీయ స్థాయిలో ఆడే ఏ క్రీడాకారుడు కూడా నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉండ‌క‌పోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. టోర్న‌మెంట్ల పేరుతో డ‌బ్బు సంపాదించుకోవాల‌ని లేదా క‌మ‌ర్షియ‌ల్ గా లాభ ప‌డాల‌ని చూస్తే మాత్రం అది ఎప్ప‌టికీ సాధ్యం కాదు.

టీజీ-20 లీగ్‌పై టీసీఏ కొరడా: విజయ్ దేవరకొండ, సిరాజ్, తిలక్ వర్మలకు నోటీసులు!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన `టీజీ 20 లీగ్-2026` ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ లీగ్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డంతో, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తన నిఘాను, చర్యలను మరింత ఉధృతం చేసింది. బీసీసీఐ (BCCI) నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటువంటి టోర్నమెంట్‌లను ప్రోత్సహించడం వల్ల స్థానిక యువ ఆటగాళ్ల భవిష్యత్తు, వారి క్రీడా కెరీర్ తీవ్ర ప్రమాదంలో పడుతుందని టీసీఏ హెచ్చరించింది. ఈ వివాదంలో భాగంగా ఇప్పటికే ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండతో పాటు, భారత స్టార్ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలకు టీసీఏ అధికారికంగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ లీగ్‌కు ప్రచారకర్తలుగా లేదా ఎండార్సర్లుగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీలు, కార్పొరేట్ స్పాన్సర్లు అందరూ తక్షణమే స్పందించి...ఈ అనధికారిక టోర్నమెంట్‌తో తమకు ఉన్న సంబంధాలపై బహిరంగంగా స్పష్టత ఇవ్వాలని టీసీఏ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువా రెడ్డి డిమాండ్ చేశారు. స‌ద‌రు టోర్న‌మెంట్ నిబంధన‌ల‌తో ప‌ని లేకుండా నిర్వ‌హిస్తున్న‌ద‌ని ఆయ‌న‌ ఆరోపించారు.

ఈ టోర్నీ విష‌యంలో అస‌లు ఎలాంటి నిబంధనలను హెచ్‌సీఏ పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) ఈ టోర్నమెంట్‌కు సంబంధించి బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక క్లియరెన్స్ పొందినట్లు ఆధారాలు చూపించడంలో విఫలమైందని ధరమ్ గురువా రెడ్డి స్పష్టం చేశారు. బీసీసీఐ ఆమోదం లేని ఇటువంటి టోర్నమెంట్‌ల వల్ల తెలంగాణ క్రికెట్ వాతావరణంలో తీవ్రమైన చట్టపరమైన... నిర్మాణాత్మకమైన గందరగోళం ఏర్పడుతుందని... నిబంధనలు ఉల్లంఘించి లీగ్ నిర్వహిస్తే క్రీడాకారుల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గల్లీల్లో ఆడే స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లకు బీసీసీఐ లేదా టీసీఏలతో సంబంధం లేకపోయినా.. అంతర్జాతీయ క్రికెటర్లు... ప్రముఖ సెలబ్రిటీలు అధికారిక నిబంధనలకు లోబడి ఉండాలి కాబట్టి బోర్డుల అనుమతి లేకుండా హెచ్‌సీఏ స్వతంత్రంగా వాణిజ్య లీగ్‌లను నిర్వహించడం లేదా ప్రముఖులు ఇటువంటి అనధికారిక టోర్నమెంట్‌లను ప్లాన్ చేయడం కుదరదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బీసీసీఐ లేదా హెచ్.సి.ఏ లోబ‌డి ఉండాల్సిన నియ‌మాల గురించి తెలుసుకోకుడానే విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి సినీసెల‌బ్రిటీ క్రికెట‌ర్ల‌కు మ‌ద్ధ‌తునిచ్చారా? అన్న‌దానిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌మేయం:

టీజీ 20 లీగ్ 2026తో కేవ‌లం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మాత్ర‌మే కాదు.. సీనియ‌ర్ హీరో, టాలీవుడ్ పిల్ల‌ర్ ద‌గ్గుబాటి వెంక‌టేష్ ప్ర‌మేయం కూడా ఉంద‌ని, ఆయ‌న‌కు కూడా లీగ‌ల్ నోటీసులు జారీ చేస్తార‌ని కూడా ప‌లు మీడియాల్లో క‌థ‌నాలు రావ‌డం చ‌ర్చ‌గా మారింది. అయితే దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.