'టీజీ' మాట.. పేలని తూటా.. !
ఈ పరిణామం ఇన్చార్జి మంత్రిగా ఉన్న టీజీ భరత్ కు పెద్ద సమస్యగా మారింది.
By: Tupaki Desk | 13 July 2025 7:00 AM ISTఅనంతపురం జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న యువ నాయకుడు, యువ మంత్రి టీజీ భరత్ పని తీరు బాగున్నా.. ఆయన మాటను ఎవరు వినిపించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక్కడ అంతా సీనియర్లే ఉండడం, పైగా వారి మాటే చెల్లుబాటు కావడం వంటివి.. టీజీ భరత్ కు పెద్ద సమస్యగా మారింది. టీజీ భరత్ తొలిసారి విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో చంద్రబాబు కూడా యువ నాయకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో భరత్ కు మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. అయితే, ఆయన కోరుకున్నది ఎన్టీఆర్ గానీ కృష్ణాజిల్లా గానీ తనకు ఇవ్వాలని అడిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ రాయలసీమ జిల్లాలో మంచి పట్టు ఉన్న నాయకుడి(టీజీ వెంకటేష్) కుటుంబానికి చెందిన యువనేత కావడంతో భరత్ కు సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాను అప్పగించారు. కానీ అనంతపురం జిల్లాలో ఒకటి రెండుసార్లు మాత్రమే పర్యటించినప్పటికీ సీనియర్ నాయకులు ఆయనను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. భరత్ నిర్వహించిన సమీక్ష సమావేశాలకు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు గత నెలలో డుమ్మా కొట్టారు. ఈ విషయంపై ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ చంద్రబాబు నుంచి ఎలాంటి చర్యలు రాలేదు. దీంతో విసిగిపోయారో లేక తనకు ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ అనంతపురం జిల్లాను దాదాపు భరత్ వదిలేశారని చెబుతున్నారు.
కేవలం తన జిల్లా.. తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా కర్నూలు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసుకొని, అక్కడి మాత్రమే పర్యటిస్తున్నారు. జిల్లా నాయకులతో మాత్రమే టచ్ లో ఉంటున్నారు. దీంతో అనంతపురం జిల్లాలో ఏకచత్రాధిపత్యంగా.. నియోజకవర్గాల్లో నాయకులు చెలరేగిపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అసలు అక్కడ జిల్లాలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అనే విషయాలు కూడా బయటికి రాకుండా ఉంటున్నాయి. అడపా దడపా మాత్రమే అక్కడ జరుగుతున్నవి వెలుగు చూసేలాగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామం ఇన్చార్జి మంత్రిగా ఉన్న టీజీ భరత్ కు పెద్ద సమస్యగా మారింది. సీఎం చంద్రబాబు ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో అనంతపురంలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించి `అక్కడ మీరేం చేస్తున్నా`రని టీజీ భరత్ను ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే తన మాట ఎవరూ వినిపించుకోవడంలేదని, ఇన్చార్జి మంత్రిగా తను ఉండలేనని కూడా భరత్ సీఎం చంద్రబాబుకు తేల్చి చెప్పినట్టు సమాచారం.
మొత్తానికి టీజీ భరత్ ఇంచార్జిగా ఉన్నా.. ఆయ మాట వినని నాయకులు, సహకరించిన నేతాగణంతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. రెండుసార్లు పర్యటించి, రెండుసార్లు సమీక్ష పెట్టినా కూడా సీనియర్ నాయకులు ఎవరూ కలిసి రాకపోవడం ఆయన మాటను వినిపించుకోకపోవడం వంటివి రాజకీయంగా టీజీ భరత్ కు ఇబ్బందికర పరిణామాలుగానే మారాయి. ఈ క్రమంలో ఆయనను వేరే జిల్లాకు పంపించే అవకాశం ఉందని సమాచారం.
