టెక్సాస్ ను ముంచేసింది.. భారీగా ప్రాణ నష్టం.. చాలామంది గల్లంతు
ఈ నేపథ్యంలో నది ఒడ్డున వేసిన వేసవి క్యాంప్ లో పాల్గొన్న 27 మంది బాలికలు ఇప్పటికీ కనపడకుండా పోవడం కలవరపెడుతోంది.
By: Tupaki Desk | 6 July 2025 2:00 PM ISTఅమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రం భారీ వర్షాలతో ఉధృతమైన వరదలతో అల్లకల్లోలంగా మారింది. ఇప్పటివరకు 50 మందికి పైగా మృతిచెందగా, మరో డజన్ల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ ఘటనను ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. మరణించిన వారిలో 20 మందికి పైగా చిన్నారులే ఉండడం గమనార్హం. ఇప్పటివరకు సుమారు 850 మందిని రక్షించినట్టు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
గత శుక్రవారం నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల ప్రభావంతో గ్వాడలూపే నదిలో నీరు పొంగిపొర్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉధృత వరదలు సంభవించాయి. చాలా ఇళ్లను వరద నీరు లాక్కెళ్లింది. అనేక వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, రక్షణ చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నది ఒడ్డున వేసిన వేసవి క్యాంప్ లో పాల్గొన్న 27 మంది బాలికలు ఇప్పటికీ కనపడకుండా పోవడం కలవరపెడుతోంది. క్యాంప్‌లో వారు ఉండగానే అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో వారు ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు సమాచారం. ఆ సమయంలో రెస్క్యూ టీమ్‌లకు అక్కడికి చేరుకునే అవకాశం లేకుండా పోయింది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్లు వాడుతూ పోలీసులు, సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇక వరదల కారణంగా గత రెండు రోజుల్లోనే మృతుల సంఖ్య 50 దాటడం, ఇంకా బతికి బయటపడే అవకాశం తగ్గిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, తన పరిపాలన ఈ విపత్తుకు సంబంధించి అత్యంత సమగ్రంగా స్పందిస్తూ సహాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
జూలై నాలుగవ తేదీ సెలవుదినం సందర్భంగా ప్రజలు నిద్రలో ఉండగానే వరదలు రావడం వల్ల చాలా మందిని ఆ ప్రమాదం ఊహించలేకపోయారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముందస్తు ఖాళీ చేయించడాలు లేకపోవడం వల్లే ప్రాణ నష్టాలు ఎక్కువయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ ఘోర ప్రకృతి విపత్తు మానవాళికి మరోసారి ప్రకృతిని తక్కువగా అంచనా వేయరాదని గుర్తు చేసింది. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కానీ మరింత ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది.
