Begin typing your search above and press return to search.

కర్ణాటక కాంగ్రెస్ కు అగ్నిపరీక్షగా మారిన ‘పెద్దల’ పోలింగ్

అయితే.. బరిలో ఐదుగురు ఉండటంతో పోలింగ్ వేళ.. అధికార పార్టీకి పరీక్షగా మారింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:33 AM GMT
కర్ణాటక కాంగ్రెస్ కు అగ్నిపరీక్షగా మారిన ‘పెద్దల’ పోలింగ్
X

కర్ణాటక కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో కిందా మీదా పడుతూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న సిద్దరామయ్య సర్కారుకు రాజ్యసభ ఎన్నికల పుణ్యమా అని ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటకలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. బరిలో ఐదుగురు ఉండటంతో పోలింగ్ వేళ.. అధికార పార్టీకి పరీక్షగా మారింది. ఎందుకంటే.. ఐదో అభ్యర్థి కారణంగా తమకు రావాల్సిన సీటు లాగేసుకుంటారన్న భయం పెరిగింది. దీంతో.. ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా మారింది.

రాజ్యసభకు ఫిబ్రవరి 27న (మంగళవారం) పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ తరఫున అజయ్ మాకెన్.. సయ్యద్ నజీర్హుస్సేన్.. జీసీ చంద్రశేఖర్ లు పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి నారాయణ్ భాండగే.. జేడీఎస్ కు చెందిన కుపేంద్ర రెడ్డిలు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న భయంలో కర్ణాటక కాంగ్రెస్ ఉంది. దీంతో.. అన్ని పార్టీలు విప్ లు జారీ చేశాయి. అయినప్పటికీ గట్టు దాటితే జరిగే నష్టం మీదా కాంగ్రెస్ లో ఆందోళన నెలకొంది.

ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేల్ని ముందు జాగ్రత్తగా బెంగళూరులోని ఒక హోటల్ కు తరలించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శాసనసభా పక్ష సమావేశాల్ని నిర్వహిస్తారని చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో అధికార పక్షమైన కాంగ్రెస్ కు 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీ.. జేడీఎస్ లకు 85 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బీజేపీకి 66 మంది.. జేడీఎస్ కు 19 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో ముగ్గురు తమకు ఓటేస్తారని కాంగ్రెస్ చెబుతోంది.

పార్టీలకు ఉన్న సంఖ్యా బలం ఆధారంగా చూస్తే.. బీజేపీ, జేడీఎస్ కూటమికి ఒక స్థానం గెలిచే అవకాశం ఉన్నా.. రెండో అభ్యర్థిని బరిలోకి దింపటంతో కాంగ్రెస్ లో కలవరపాటుకు గురవుతోంది. ఎన్నికలు జరిగే నాలుగు స్థానాలకు ఒక్కో అభ్యర్థి విజయానికి 45 ఓట్లు పొందాల్సి ఉంటుంది. ఐదో అభ్యర్థి బరిలో ఉన్ననేపథ్యంలో ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు. దీంతో.. ఐదో అభ్యర్థిగా ఉన్న బీజేపీ -జేడీఎస్ కూటమికి చెందిన కుపేంద్ర రెడ్డి గెలుపునకు ఐదు ఓట్లు అవసరం. దీంతో.. క్రాస్ ఓటింగ్ జరిగితే.. అధికార పక్షం వశం కావాల్సిన పెద్దల సీటు ప్రతిపక్షానికి దక్కుతుంది. అదే జరిగితే.. సిద్దరామయ్య సర్కారుకు భారీ ఎదురుదెబ్బ అవుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరగా వచ్చేసిన వేళ.. సీటును కోల్పోతే.. జరిగే నష్టం ఎక్కువ. అందుకే.. కాంగ్రెస్ కేర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.