Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయ అభ్యర్థిపై ఎలాన్‌ మస్క్‌ ప్రశంసలు!

త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ అమెరికన్లు కూడా మొగ్గు చూపుతున్నారు

By:  Tupaki Desk   |   18 Aug 2023 9:37 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయ అభ్యర్థిపై ఎలాన్‌ మస్క్‌ ప్రశంసలు!
X

త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ అమెరికన్లు కూడా మొగ్గు చూపుతున్నారు. మొత్తం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. వారిలో వివేక్‌ రామస్వామి ఒకరు. అలాగే ఆయనతోపాటు నిక్కీ హీలీ, హర్ష వర్ధన్‌ సింగ్‌ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా పోటీలో ఉన్నారు.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వివేక్‌ రామస్వామి అత్యంత దూకుడుగా తన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే గడపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్‌ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తున్నారు. తద్వారా రిపబ్లికన్‌ పార్టీ తరఫున తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా టక్కర్‌ కార్ల్సన్‌ షోలో పాల్గొన్న వివేక్‌ రామస్వామి ప్రపంచంలోని బడా వ్యాపారవేత్తలు చైనా వెంటపడటాన్ని గుర్తు చేస్తూ వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానని భరోసా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామిపై టెస్లా, ట్విట్టర్‌ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రశంసలు కురిపించారు. రామస్వామి నమ్మకమైన అభ్యర్థి అని కొనియాడారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు వివేక్‌ రామస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూను షేర్‌ చేస్తూ ఎలాన్‌ మస్క్‌ ఈ మాట చెప్పడం విశేషం.

కాగా ఇటీవల ఎలాన్‌ మస్క్‌ చైనాలో పర్యటించడాన్ని వివేక్‌ రామస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. మస్క్‌.. చైనా విదేశాంగ మంత్రితో భేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య దూరం పెరగడాన్ని వ్యతిరేకించడంతోపాటు రెండు దేశాలను కవలలుగా పేర్కొనడం అత్యంత ఆందోళన కలిగించే విషయమని రామస్వామి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చైనా ఎజెండాకు అనుకూలంగా ఎలాన్‌ మస్క్‌ ప్రచారం చేస్తున్నారని, ఇది చైనాకు అనుకూలిస్తుందని రామస్వామి తప్పుబట్టారు. అమెరికాకు కావాల్సింది.. చైనా జేబుల్లో ఉండే నేతలు కాదని తీవ్ర విమర్శలు చేశారు. అయినప్పటికీ వివేక్‌ రామస్వామిని ఎలాన్‌ మస్క్‌ ప్రశంసించడం గమనార్హం.

కాగా అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన వివేక్‌ రామస్వామి ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. ఆయన వయసు కేవలం 37 సంవత్సరాలే. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.