టెస్లా సీఎఫ్‌వోగా భారత సంతతి వ్యక్తి.. నియామకం తర్వాత అనూహ్య పరిణామం!
వైభవ్ తనేజా భారత సంతతికి చెందిన వ్యక్తి. ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ లో పట్టా పుచ్చుకున్నారు
By: Tupaki Desk | 8 Aug 2023 5:11 AM GMTట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని మాతృ సంస్థ ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ముఖ్య ఆర్థిక నిర్వహణ అధికారి(సీఎఫ్‌వో)గా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా నియమితులయ్యారు. అయితే.. ఈ నియామక ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. టెస్లా షేర్లు ఒక్కసారిగా 3 శాతం మేరకు పతనమయ్యాయి.
ఇక, ఇప్పటి వరకు సీఎఫ్‌వోగా ఉన్న జాచరీ కిర్కోర్న్ ఈ పదవికి రాజీనామా చేశారు. జాచరీ గత నాలుగేళ్లుగా టెస్లాకు సేవలు అందిస్తున్నారు. అయితే.. ఈయన ఆకస్మికంగా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఏయే కారణాలతో ఆయన రాజీనామా చేశారనేది తెలియాల్సి ఉంది. ఇక, తన నిష్క్రమణకు కారణాలు చెప్పకుండానే జాచరీ ఆసక్తికర పోస్టు చేశారు.
''టెస్లా కంపెనీలో భాగం కావడం ఒక ప్రత్యేక అనుభవం. నేను 13 ఏళ్ల క్రితం చేరినప్పటి నుంచి ఇప్పటి దాకా అందరితో కలిసి పనిచేసినందుకు చాలా గర్వపడుతున్నా'' అని లింక్డ్ ఇన్ పోస్టులో జాచరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో టెస్లా అకౌంటింగ్ హెడ్‌గా ఉన్న భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజాను నియమించారు.
వైభవ్ తనేజా ఎవరంటే..
వైభవ్ తనేజా భారత సంతతికి చెందిన వ్యక్తి. ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ లో పట్టా పుచ్చుకున్నారు. వైభవ్‌కు అకౌంటింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉంది. టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్, టెలీ కమ్యూనికేషన్స్ ఎమ్ఎన్‌సీ కంపెనీల్లో గతంలో పనిచేశారు. 2016లో సోలార్ సిటీని టెస్లా కొనుగోలు చేసిన తరువాత అందులో చేరారు. ప్రధాన అకౌంటింగ్ అధికారిగా తన ప్రాథమిక బాధ్యతతో పాటు, ‘మాస్టర్ ఆఫ్ కాయిన్’ పాత్రను పోషించనున్నట్లు టెస్లా కంపెనీ తెలిపింది. 2021లో తనేజా టెస్లా భారతీయ విభాగానికి డైరెక్టర్‌గానూ నియమితులయ్యారు.