Begin typing your search above and press return to search.

క్రేజీగా టెస్లా షోరూం అద్దెలు.. కళ్లు చెదరాల్సిందే

ఈ ఐదేళ్ల లీజు ఎంతో తెలుసా? అక్షరాల రూ.23.38 కోట్లుగా చెబుతున్నారు. మొత్తం 4 వేల చదరపు అడుగుల స్థలంలో షోరూంను ఏర్పాటు చేయనున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 8:00 PM IST
క్రేజీగా టెస్లా షోరూం అద్దెలు.. కళ్లు చెదరాల్సిందే
X

టెస్లా ఈవీ కార్లకుండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ తాజాగా ఇండియాలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ అంశాల్ని పక్కన పెడితే.. ఇప్పుడు మాత్రం ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న షోరూం అద్దెల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనికి కారణం.. ఈ డీల్ రియాల్టీ మార్కెట్ లో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. భారతదేశంలో తన మొదటి టెస్లా షోరూంను ముంబయిలో ఏర్పాటు చేయనున్నారు.

ప్రపంచంలోనే ఈవీ వాహనాల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే టెస్లా,. భారత్ లో తన మొదటి షోరూంను ఓపెన్ చేయటం ద్వారా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్ అయిన భారత్ లో ఎంట్రీ ఇస్తున్నట్లుగా చెప్పాలి. టెస్లా తన మొదటి కారు లాంచ్ విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే ‘మోడల్ వై’ తో భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. వచ్చే నెలలో ముంబయిలో టెస్లా అధికారిక షోరూం షురూ కానుంది.

అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో ఇంకో షోరూంను ఏర్పాటు చేయనున్నారు. ముంబయిలోని టెస్లా షోరూం ఏర్పాటు చేస్తున్న ల్యాండ్ కు సంబంధించిన లీజు వ్యవహారాల్ని సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ అనే సంస్థ చూస్తోంది. ముంబయిలోని అత్యంత ఖరీదైన వాణిజ్య ప్రదేశమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో టెస్లా షోరూం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదేళ్ల కాంటాక్టు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ ఐదేళ్ల లీజు ఎంతో తెలుసా? అక్షరాల రూ.23.38 కోట్లుగా చెబుతున్నారు. మొత్తం 4 వేల చదరపు అడుగుల స్థలంలో షోరూంను ఏర్పాటు చేయనున్నారు. వాణిజ్య ప్రదేశానికి సంబంధించి ఇంతటి భారీ డీల్ దేశంలోనే రికార్డుగా పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన షోరూం లీజు డీల్ గా పేర్కొంటున్నారు. ముంబయి నార్త్ అవెన్యూలోని మేకర్ మాక్సిటీ అనే కమర్షియల్ కాంప్లెక్స్ లో టెస్లా.. షోరూం స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ లీజు ఒప్పందం కూడా రికార్డుగా పేర్కొంటున్నారు.

మొదటి ఏడాది నెలకు రూ.35.26 లక్షలు చొప్పున షోరూం లీజుకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా పెంచుకుపోయే ఈ లీజు మొత్తం ఐదేళ్లకు ప్రతి నెలా రూ.42.86 లక్షలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలతో పాటు ముంబయి కుర్లా ప్రాంతంలోని లోధా లాజిస్టిక్స్ పార్కులో 24,565 చదరపు అడుగుల స్థలాన్ని వేర్ హౌస్ కోసం లీజుకు తీసుకున్నారు. ఐదేళ్ల కాలానికి రూ.24.38 కోట్ల అద్దెను చెల్లించేందుకు వీలుగా ఒప్పందాలు కుదుర్చుకోవటం గమనార్హం. కార్ల అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. తమ కార్యకలాపాలకు అవసరమైన స్థలాన్ని అద్దెకు తీసుకునే లీజు మొత్తంలో మాత్రం టెస్లా సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుందని మాత్రం చెప్పక తప్పదు.