Begin typing your search above and press return to search.

కలిసొచ్చే కాలానికి.. ఫ్యాక్టరీ నుంచి ఇంటికే నడిచొచ్చే టెస్లా వై కారు

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో టెస్లా రేంజ్ వేరు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టి సంచలనం రేపింది. అయితే, ఇవి సెమీ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు. అంటే... మనం అథంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 10:00 AM IST
కలిసొచ్చే కాలానికి.. ఫ్యాక్టరీ నుంచి ఇంటికే నడిచొచ్చే టెస్లా వై కారు
X

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని తెలుగులో పాపులర్ సామెత.. దీనికి ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా కొత్త వెర్షన్ కారుకు వర్తింపజేస్తే.. కలిసొచ్చే కాలానికి.. ఫ్యాక్టరీ నుంచి ఇంటికే నడిచొచ్చే కారు అని చెప్పొచ్చు. ఒకప్పుడు కారు కొనాలంటే.. షోరూంలు చూడాలి.. మోడల్ నచ్చాలి.. అడ్వాన్స్ కట్టాలి.. ఆపై పేపర్లన్నీ సరిచూసుకోవాలి.. కానీ, ఇప్పడు బుక్ చేసుకుని కొనడమే ఆలస్యం.. కారు నేరుగా తనంతట తానే తోలుకుంటూ మన ఇంటికే వస్తోంది. అందుకే కలిసొచ్చే కాలానికి సామెతను ఇక్కడ వాడాల్సి వస్తోంది.

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో టెస్లా రేంజ్ వేరు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టి సంచలనం రేపింది. అయితే, ఇవి సెమీ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు. అంటే... మనం అథంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారు మాత్రం రాలేదు. తాజాగా ఆ లోటు తీర్చింది టెస్లా. వినియోగదారులు ఆసక్తిగా చూస్తున్న టెస్లా తొలి పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారు వచ్చేసింది. మనిషి కంట్రోల్ లేకుండా.. నేరుగా ఫ్యాక్టరీ నుంచే ఇంటికి డెలివరీ అయింది కారు. తనంతట తానే తోలుకుంటూ 30 నిమిషాల్లో హైవేలు, ట్రాఫిక్ సిగ్నళ్లు దాటుకుంటూ ప్రయాణించింది.

ఇది టెస్లా మోడల్‌ వై. ఈ కారు సెల్ఫ్ డ్రైవింగ్ వీడియోను టెస్లా కంపెనీ ఎక్స్‌ లో పోస్ట్‌ చేసింది. ఇది వైరల్ గా మారింది. ఫ్యాక్టరీ నుంచి బయల్దేరి రోడ్డుపై కావల్సినట్లుగా వేగం తగ్గించుకుంటూ, మలుపుల వద్ద నియంత్రించుకుంటూ, ముందు, పక్కనుంచి వెళ్లే వాహనాలను సరిచూసుకుంటూ వెళ్లింది. పైగా తనను కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడి పార్కింగ్ ప్రదేశంలో ఆగింది.

టెస్లా వై కారు వీడియోను సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ లో పెట్టారు. అసలు డ్రైవర్ లేకుండా, రిమోట్ తో ఆపరేట్ చేయకుండా రోడ్లపై మొట్టమొదటి ప్రయాణం ఇదే అని పేర్కొన్నారు.

కాగా టెస్లా కారు అంటేనే అద్భుతం అని భావిస్తారు. అందులోని ఫీచర్లు దీనికి కారణం. ఇక టెస్లా వై.. గంటకు 115 కిలోమీటర్ల వేగం సైతం అందుకుంది.

కొసమెరుపు: టెస్లా ఏఐ సాఫ్ట్‌ వేర్ వైస్ ప్రెసిడెంట్‌ భారతీయుడే. ఆయన పేరు అశోక్‌ ఎల్లుస్వామి. చూస్తే.. ఈయన తెలుగువారు గానూ ఉన్నారు.