టెస్లా వచ్చేసిందోచ్.. మంగళవారమే షోరూం షురూ.. ఆ నగరంలోనే..
నాలుగేళ్లుగా ఇదిగో టెస్లా.. అదిగో టెస్లా వచ్చేసింది అనే వార్తలే తప్ప అది వచ్చేది ఎప్పుడనేది నిర్ధారణ కాలేదు. ఇకపై ఆ ఎదురుచూపులకు తెరపడనుంది.
By: Tupaki Desk | 11 July 2025 1:04 PM ISTఆకట్టుకునే డిజైన్.. తేలికైన బాడీ.. ఆటోమేటిక్ లో రారాజు.. ఎలక్ట్రిక్ వాహనాల్లో కింగ్.. తిరుగులేని టెక్నాలజీ.. ఇవన్నీ కలిస్తే ‘టెస్లా‘. అమెరికా దిగ్గజ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన కార్లను విక్రయించింది... కానీ, అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో తప్ప.. నాలుగేళ్లుగా ఇదిగో టెస్లా.. అదిగో టెస్లా వచ్చేసింది అనే వార్తలే తప్ప అది వచ్చేది ఎప్పుడనేది నిర్ధారణ కాలేదు. ఇకపై ఆ ఎదురుచూపులకు తెరపడనుంది.
టెస్లా అంటే సూపర్ కారు. అమెరికాలో మోజు తగ్గిందేమో కానీ.. భారతీయుల్లో క్రేజ్ అలానే ఉంది. మరి ఇంతకాలం ఎందుకు భారత్ లోకి రాలేదు? దీనికి కారణం.. మొదట భారత్ లోనే ప్లాంట్ నిర్మించి ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టడమే. టెస్లా మాత్రం.. తాము ముందుగా విదేశాల్లో ఉత్పత్తి చేసి భారత్ లో ప్రవేశపెడతామని, తర్వాత ప్లాంట్ పెడతామని ప్రితిపాదించింది. చివరకు ఈ ఏడాది అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన అనంతరం ఎట్టకేలకు టెస్లా భారత్ లోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా.. భారత్ లో ఎంట్రీ ఇస్తోంది. భారత ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15న మంగళవారం ఇది షురూ కానుంది. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో షోరూం ప్రారంభిస్తారని తులస్తోంది.
ఇప్పటిక టెస్లా ’వై’ మోడల్ కార్లు ముంబైకి చేరుకున్నాయి. చైనా ఆర్థిక రాజధాని షాంఘై నుంచి వీటిని తరలించారు. ఇక ముంబై తర్వాత భారత రాజధాని ఢిల్లీలో టెస్లా రెండో షోరూమ్ నెలకొల్పనుంది.
2021లో టెస్లా భారత్ లోకి వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)లపై ఇంపోర్ట్ ట్యాక్స్ బాగా తగ్గించడంపై పీటముడి పడింది. అలాగైతే.. ఇంపోర్ట్ ట్యాక్స్ బాగా తగ్గించాలని టెస్లా కోరింది. అలాగైతే భారత్ లోనే తయారీ (మేకిన్ ఇండియా)తో పాటు విడి భాగాలు కొంటేనే అని కేంద్రం షరతు విధించింది. దీనికి మస్క్ ఒప్పుకోక పోవడంతో ప్రక్రియ ఆగింది. మోదీ అమెరికా టూర్ లో మస్క్ తో మొత్తానికి సంప్రదింపులు పూర్తయ్యాయి. రూ.34 లక్షల (40 వేల డాలర్ల) కంటే ఎక్కువ ఖరీదైన హైఎండ్ కార్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది.
కొసమెరుపు: షోరూంలు ఏర్పాటుకే టెస్లా పరిమితం కానుంది. సొంతంగా ప్లాంట్ మాత్రం నెలకొల్పేందుకు మాత్రం ఇష్టపడడం లేదు.
