డోజ్ వల్ల ఎలాన్ మస్క్ కు టెస్లా నుంచి బిగ్ షాక్ రెడీ!
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో సంస్కరణల కోసమని ఏర్పాటు చేసిన "డోజ్" కు సారథిగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2025 1:00 PM ISTడొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో సంస్కరణల కోసమని ఏర్పాటు చేసిన "డోజ్" కు సారథిగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం చేసిన కృషికి ఫలితంగా మస్క్ కు ఈ పదవి దక్కిందని అంటారు. అయితే... దీని వల్ల ఎలాన్ మస్క్ కు టెస్లా నుంచి సమస్యలు సిద్ధంగా ఉన్నాయనే కథనాలు దర్శనమిస్తున్నాయి.
అవును... డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా మారిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ను టెస్లా సీఈఓ బాధ్యతల నుంచి తప్పించాలని కంపెనీ బోర్డు భావిస్తోందని.. కొత్త వ్యక్తి నియామకం కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని.. సంబంధిత వ్యక్తులు ఈ విషయన్ని వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి!
ట్రంప్ పాలనలో ఎదురవుతున్న విమర్శలకు మస్క్ కూడా ఓ కారణం అనే చర్చ ఇటీవల బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే! ప్రధానంగా... పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో మస్క్ కీలక పాత్ర పోషించారని విమర్శలు బలంగా వినిపించాయి. ఇవి మస్క్ వ్యాపారాలపై ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు.
ఇదే సమయంలో.. రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఎలాన్ మస్క్ తన వ్యాపారాలను పట్టించుకోవడం లేదనే చర్చ పెట్టుబడిదారుల్లో మొదలైందని చెబుతున్నారు. ఈ మేరకు పలువురు పెట్టుబడిదారులు ఈ మేరకు ఆందోళనలను వ్యక్తం చేశారట. పైగా.. తాజాగా టెస్లా విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యలోనే టెస్లా బోర్డు కీలక ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే టెస్లా సీఈఓ బాధ్యతల నుంచి ఎలాన్ మస్క్ ను తప్పించాలని కంపెనీ బోర్డు భావిస్తోందని అంటున్నారు. అయితే... ఈ కథనాలపై ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మీడియా కథనాలను ఎక్స్ వేదికగా ఖండించారు. తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, పత్రిక విలువల ఉల్లంఘనలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
కాగా... టెస్లా ప్రస్తుత ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాల్లో పెద్ద ఎత్తున నష్టాల్ని మూటగట్టుకుంది! ఇందులో భాగంగా... లాభంలో సుమారు 71 శాతం క్షీణత నమోదు చేసుకుంది. దీనికి డోజ్ సారథి కారణమని టెస్లా కంపెనీ బోర్డు సభ్యులు భావిస్తున్నారని అంటున్నారు.
