సైనికులను చూసి భయపడ్డ బాధితులు... షాకింగ్ వీడియో!
జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర షాకింగ్ ఘటనగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 April 2025 10:16 AM ISTజమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర షాకింగ్ ఘటనగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. సుమారు 28 మంది పర్యాటకులు మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో తాజాగా తెరపైకి వచ్చింది.
అవును.. పహల్గాంలో మంగళవారం జరిగిన సాయుధ ఉగ్రదాడిలో ఇప్పటివరకూ 28 మంది పర్యాటకులు మృతి చెందగా.. మరో 20 మంది వరకూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన ముష్కరులు సైనిక దుస్తుల్లో రావడంతో పర్యాటకులు అప్రమత్తమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే... ఈ ఘటన అనంతరం అక్కడకు భారత సైనికులు చేరుకోగా.. అప్పటికే తమపై కాల్పులు జరిపిన వారు అదే దుస్తుల్లో కనిపించేసరికి.. నిజమైన ఆర్మీని చూసి బాధితులు భయపడిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పర్యాటకులను ఆ ఘటన ఏ స్థాయిలో భయపెట్టిందనేది దీన్ని బట్టి మరింత క్లారిటీగా తెలుస్తోందని అంటున్నారు.
తాజాగా తెరపైకి వచ్చిన వీడియోలో.. ఉగ్రవాదులు సైతం సైనిక దుస్తుల్లో రావడంతో అసలైన ఇండియన్ ఆర్మీ కూడా అదే దుస్తుల్లో కనిపించేసరికి జనాలు వారిని చూసి భయాందోళనకు గురయ్యారు. ఇందులో.. గాయపడిన ఓ మహిళ, ఓ బాలుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తున్నారు స్థానికులు. ఈ సమయంలో వారికి భారత సైనికులు రక్షణగా ఉన్నారు.
ఈ సమయంలో ఆర్మీ యూనిఫాంలో ఉన్న అసలైన సైనికులను చూసి బాలుడు ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టాడు. అదే దుస్తుల్లో వచ్చిన ముష్కరులు తన కళ్లముందే తండ్రిని కాల్చిచంపడాన్ని చూసిన బాలుడు భయంతో అరిచినట్లు తెలుస్తోంది! ఇదే సమయంలో.. నా కొడుకును చంపొద్దు అంటూ ఆ బాలుడి తల్లి ప్రాథేయపడింది.
దీంతో... అక్కడున్న భారత సైనికులు తాము అసలైన సైనికులమని.. మిమ్మల్ని రక్షించడానికే తాము వచ్చామని వారికి చెబుతూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు! ఈ సమయంలో తన భర్తను చంపేశారంటూ అ మహిళ రోదిస్తుండగా.. ఆమె కుమారుడు తీవ్ర భయాందోళనలతో కనిపించడం నెటిజన్లను భావోద్వేగానికి గురుచేస్తోంది.
