Begin typing your search above and press return to search.

6గంటల్లో 3,300 మంది..శ్రీనగర్ విమానాశ్రయానికి పోటెత్తిన పర్యాటకులు

కేవలం ఆరు గంటల వ్యవధిలోనే 3,300 మంది పర్యాటకులు శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరారు.

By:  Tupaki Desk   |   23 April 2025 6:55 PM IST
Kashmir Tourists Fly Back To Home
X

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడి, లోయలో భయాందోళనలను సృష్టించింది. పర్యాటకులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో వీలైనంత త్వరగా కాశ్మీర్ ను విడిచి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊహించని ఈ ఉగ్రదాడితో భయపడిపోయిన వేలాది మంది తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే 3,300 మంది పర్యాటకులు శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరారు.

కేంద్ర మంత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. "పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యాటకుల సురక్షితమైన ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఎయిర్ పోర్టులో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాం. ప్రయాణికులకు ఆహారం, నీరు అందించాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి మొత్తం 20 విమానాలు బయలుదేరాయి. ఈ విమానాల ద్వారా 3,337 మంది పర్యాటకులు క్షేమంగా ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలను అందుబాటులో ఉంచాం. టికెట్ ధరలు పెంచవద్దని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే అన్ని ఎయిర్‌లైన్‌లు టికెట్ రద్దు మరియు రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేశాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మనమందరం పర్యాటకులకు అండగా నిలవాలి" అని పేర్కొన్నారు.

మరోవైపు, పర్యాటకులు లోయను వీడుతుండడం పట్ల జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "కాశ్మీర్ లోయ నుంచి మా అతిథులు వెళ్లిపోతుంటే నా హృదయం బాధతో నిండిపోతోంది. అయితే వారు ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను. పర్యాటకుల తిరుగు ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రం ఏర్పాటు చేసిన అదనపు విమానాలతో పాటు రోడ్డు మార్గంలోనూ ప్రయాణానికి అన్ని సౌకర్యాలు కల్పించాం" అని ఆయన అన్నారు.

కాశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై దారుణంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అయితే, భయాందోళనల మధ్య పర్యాటకుల వలస కొనసాగుతోంది.