పహెల్గామ్ దాడిలో ఐబీ ఆఫీసర్, ఓ వైజాగ్ వాసి దుర్మరణం.. తీవ్ర దిగ్బ్రాంతి
కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహెల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన అమానుష ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
By: Tupaki Desk | 23 April 2025 10:01 AM ISTకాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహెల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన అమానుష ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇటీవలి కాలంలో కాశ్మీర్‌లో పౌరులే లక్ష్యంగా జరిగిన అతి పెద్ద దాడులలో ఇదొకటి. ఈ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి ఒకరు, విశాఖపట్నం నివాసి ఒకరు మరణించారు.
విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన చంద్రమౌళి ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆయన్ను వెంబడించి కాల్చిచంపినట్లు సమాచారం. ప్రాణాలు తీయవద్దని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరం చూపలేదని తెలిసింది. తోటి పర్యాటకులు చంద్రమౌళి మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఆయన కుటుంబ సభ్యులు పహెల్గామ్‌కు బయలుదేరి వెళ్లారు.
మరో విషాదకర ఘటనలో హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో పనిచేస్తున్న మనీష్ రంజన్ అనే అధికారి కూడా ఈ దాడిలో మరణించిన పర్యాటకులలో ఉన్నారు. బీహార్‌కు చెందిన మనీష్ రంజన్ తన కుటుంబంతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఉగ్రవాదులు అతి కిరాతకంగా ఆయన భార్య, పిల్లల కళ్లెదుటే కాల్చిచంపారు. మనీష్ రంజన్ హైదరాబాద్‌లోని ఐబీ కార్యాలయంలో మినిస్టీరియల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
అనధికారిక నివేదికల ప్రకారం.. ఈ ఉగ్ర కాల్పుల ఘటనలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారు. ఈ దాడి దేశ భద్రతకు సవాలు విసురుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ పర్యటనను కుదించుకొని ఈ ఉదయం హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఆయన ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.
ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే ఆయన శ్రీనగర్ వెళ్లి బాధితులను పరామర్శించే అవకాశం ఉంది. ఈ దాడి ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
