Begin typing your search above and press return to search.

వైసీపీ టీడీపీలలో టెన్షన్ టెన్షన్...!

టీడీపీ విషయానికి వస్తే మూడు అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించింది.

By:  Tupaki Desk   |   5 March 2024 4:00 AM GMT
వైసీపీ టీడీపీలలో టెన్షన్ టెన్షన్...!
X

ఉత్తరాంధ్రాలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది సీట్లలో అభ్యర్ధులు ఎవరు ఎవరికి టికెట్లు దక్కుతాయన్నది రెండు పార్టీలలోని ఆశావహులలో టెన్షన్ పెడుతోంది. టీడీపీ విషయానికి వస్తే మూడు అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించింది. టెక్కలిలో కింజరాపు అచ్చెన్నాయుడు, ఆముదాలవలసలో కూన రవికుమార్, ఇచ్చాపురంలో బెందాళం అశోక్ లను ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పేర్కొంటూ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది.

ఇంకా ఏడు సీట్లలో అభ్యర్ధులను ఆ పార్టీ ప్రకటించాల్సి ఉంది. అందులో నరసన్నపేట, ఎచ్చెర్ల, పలాస, పాతపట్నం, పాలకొండ, రాజాం సీట్లలో వర్గ పోరు ఉంది. ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. వారంతా టీడీపీ ప్రకటించబోయే రెండవ జాబితా కోసం చూస్తున్నారు. తమ పేరు లేకపోతే అసమ్మతి రాగాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు అని టాక్.

అధికార వైసీపీ విషయానికి వస్తే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు అయితే ఎవరినీ ప్రకటించలేదు. ఇంచార్జిల పెరుతోనే ప్రకటిస్తోంది. వారి పనితీరుని కూడా మధింపు చస్తూ మార్పులు చేర్పులూ ఉంటాయని అంటోంది. తాజాగా చూస్తే కనుక ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంచార్జిలు అభ్యర్ధులు కారని బాంబు పేల్చారు. అభ్యర్ధుల లిస్ట్ మొత్తం 175 మందిని కలిపి పార్టీ హై కమాండ్ రిలీజ్ చేస్తుందని కూడా ఆయన చెప్పారు.

ఇక వైసీపీలో చూస్తే నరసన్నపేటకు ధర్మాన కిష్ణదాస్ ఖాయం. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు సీటు పదిలం. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారు అని అంటున్నారు. పాలకొండకు సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతిని ఫిక్స్ చేస్తున్నారు. రాజాం లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు బదులుగా ఒక డాక్టర్ కి టికెట్ ఇస్తారని అంటున్నారు.

ఇవి కాకుండా అసమ్మతి పీక్స్ మీద ఉండే సీట్లు ఉన్నాయి. అవి ఎచ్చెర్ల. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ని సొంత పార్టీలోనే ప్రత్యర్ధులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే రచ్చ చేయడం ఖాయం. పాతపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విషయంలోనూ లాగే ఉంది. ఇటీవల పార్టీ మీటింగ్ పెడితే ముఖ్య నేతలు గైర్ హాజరు అయ్యారు.

ఆముదాలవలస స్పీకర్ తమ్మినేని సీతారాం సీటు. ఇక్కడ వర్గ పోరు ఒక స్థాయిలో ఉంది. మళ్ళీ తమ్మినేనికే టికెట్ అంటే మాత్రం అసమ్మతి జ్వాలలు ఎగిసిపడడం ఖాయం అంటున్నారు. పలాసలో సీదరి అప్పలరాజుకు వ్యతిరేకంగా పార్టీలో వర్గం పనిచేస్తోంది. వారు కూడా ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మిగిలిన చోట్ల మాత్రం ఓకే అన్నట్లుగా ఉన్నా అటు టీడీపీ ఇటు వైసీపీలలో మాత్రం కీలక స్థానాల్లో రాజకీయ రగడ తప్పేట్లు లేదని అంటున్నారు. దాంతో అంతా టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉందని అంటున్నారు.