హిందూపురంలో హైటెన్షన్.. ఏం జరిగింది?
టీడీపీ సీనియర్ నాయకుడు, నటసింహం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవ ర్గంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది.
By: Garuda Media | 16 Nov 2025 11:53 PM ISTటీడీపీ సీనియర్ నాయకుడు, నటసింహం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవ ర్గంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. దీనికి కారణం.. టీడీపీ కార్యకర్తలుకొందరు హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడి చేసి.. ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు.. వైసీపీ జెండాలను కూడా పీకేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అయినప్పటికీ.. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో పోలీసులు పహారా పెంచారు.
అసలు ఏం జరిగింది?
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దీపిక. ఇటీవల రెండు రోజుల కిందట వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో హిందూపురంలోనూ నిరసన చేశారు. ఈ సమయంలో దీపిక భర్త.. వేణు.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ``ఎవరో హైదరాబాద్ లో ఉండే వాడి కాళ్ల కింద బతుకుతున్నాం. వారికి ఓట్లు వేస్తాం, వారు హైదారబాద్‌లో కూర్చుంటాడు. మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నాం.`` అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. ఎమ్మెల్యే బాలయ్యను ఉద్దేశించి వాడు-వీడు అని వ్యాఖ్యానించడం తో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్యకు తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే.. వేణు ఈ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. పైగా.. తాను ఉన్నదే మాట్లాడానని చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు.. ఆయన నుంచి వివరణ కోరేందుకు.. పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కొందరు కార్యకర్తలు కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
హిందూపురంలో బోణీ కొట్టని వైసీపీ
ఇక, రాజకీయంగా చూసుకుంటే హిందూపురంలో వైసీపీ ఇప్పటి వరకు బోణీ కొట్టలేక పోయింది. 2014 నుంచి గత ఏడాది జరిగిన వరుస మూడు ఎన్నికల్లోనూ బాలయ్య విజయం దక్కించుకున్నారు. ఇది కూడా వైసీపీలో ఆగ్రహానికి, అసహనానికి దారితీసింది. దీనికితోడు అంతర్గత కుమ్ములాటలతో వైసీపీలో ఆధిపత్య పోరు కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాల క్రమంలోనే వేణు పైచేయిసాధించేందుకు బాలయ్యను టార్గెట్ చేసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.
