గుడ్డిగా ప్రేమించే భర్తను ప్లాన్ చేసి మరీ ఏసేసింది
బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు వచ్చేలా చోటు చేసుకున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి.
By: Tupaki Desk | 2 May 2025 4:00 PM ISTబంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు వచ్చేలా చోటు చేసుకున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకే వస్తుందీ ఉదంతం. తెనాలిలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. భార్యను గుడ్డిగా ప్రేమించే భర్తను.. పరాయి వ్యక్తి మోజులో పడి.. అతడితో సంబంధం కోసం చంపేసిన దుర్మార్గ ఘటనగా దీన్ని చెప్పాలి. అసలేం జరిగిందంటే..
తెనాలికి చెందిన 27 ఏళ్ల వెంకట మణి ప్రథ్వీరాజ్ కు దూరపు బంధువైన వెంకట లక్ష్మితో ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. అప్పటికే ఆమెకు పెళ్లైంది. భర్త అనారోగ్యం కారణంగా మరణించగా.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. వీరికి పిల్లల్లేరు. కొద్ది నెలల క్రితం వీరు పనుల కోసం బెంగళూరు వెళ్లారు. అక్కడ భవన నిర్మాణంలో పని చేయటం మొదలు పెట్టారు. ఈ సమయంలోనే పల్నాడు జిల్లా వెల్లటూరుకు చెందిన 23 ఏళ్ల కోటేశ్వరరావు పరిచయమయ్యాడు.
ఇదిలా ఉంటే.. బెంగళూరులో పరిస్థితులు నచ్చక వెంకట మణి ప్రథ్వీరాజ్ తిరిగి తెనాలికి వచ్చేశాడు. వెంకటలక్ష్మి మాత్రం బెంగళూరులోనే ఉండిపోయింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ నాలుగు నెలలుగా కలిసి ఉంటున్నారు. ఆమెను తీసుకొని కోటేశ్వరరావు తన సొంతూరుకు వచ్చేశాడు. ఆ టైంలో తాను పుట్టింట్లో ఉన్నట్లుగా వెంకట లక్ష్మి భర్తకు అబద్ధాలు చెప్పేది. ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె మాటల్ని నమ్మేవాడు.
సహజీవనం సమయంలో తాగి వచ్చే కోటేశ్వరరావు వెంకటలక్ష్మిని కొట్టేవాడు. దీంతో.. ఆమె అతడి నుంచి వచ్చేసి భర్త వద్దకు చేరింది. అయితే.. కోటేశ్వరరావు మాత్రం వెంకటలక్ష్మికి ఫోన్లు చేస్తూ ఉండేవాడు. అనుమానం రాకుండా ఉండేందుకు అన్నయ్య అంటూ కోటేశ్వరరావుతో మాట్లాడేది. అంతేకాదు.. భర్తతో కూడా మాట్లాడిచ్చేది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. అతడ్ని తొలగించేందుకు ప్లాన్ చేశారు.
కోటేశ్వరరావు బంధువు ఒకడు గుంటూరులో ఉంటాడు. అతడు.. అతడి స్నేహితుడు.. మరో మైనర్ బాలుడితో కలిపి వెంకట మణి ప్రథ్వీరాజ్ హత్యకు ప్లాన్ చేశారు. తమ పథకంలో భాగంగా ఏప్రిల్ 27న తెనాలికి వచ్చారు. వెంకట మణి ప్రథ్వీరాజ్ కు ఫోన్ చేసి పార్టీ అని చెప్పాడు. వీరి మాటల్ని నమ్మి వెళ్లిన అతడి చేత ఫుల్ గా తాగించి కత్తితో పొడిచి.. రాయితో మోది చంపేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న ఫోన్ తీసుకొని పారిపోయారు.
తన కొడుకు మరణం విషయంలో తమ కోడలిపై అనుమానం ఉందంటూ వెంకట మణి ప్రథ్వీరాజ్ ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో భాగంగా ఫోన్ కాల్ డేటా.. ఇతర సాంకేతికతతో సాక్ష్యాల్ని సంపాదించిన పోలీసులు వెంకటలక్ష్మి.. కోటేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాన్ని చెప్పేసి.. హత్య చేసిన వైనాన్ని ఒప్పుకున్నారు. భార్య వెంకటలక్ష్మిని అమితంగా ప్రేమించేవాడని.. పెళ్లైన కొత్తల్లో ఆమె పేరును ఇంగ్లిషులో పచ్చబొట్టు పొడిపించుకున్నాడని.. ఆ తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక బాధ పడుతూ ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. చివరకు ప్రాణంగా ప్రేమించిన భార్య చేతికే బలి కావటం అందరిని వేదనకు గురి చేస్తోంది.
