Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో ‘కూటములకు’ అధిక శాతం ఓటములే!

ఎన్నికలన్నాక పొత్తులు సహజం.. పోటాపోటీ హామీలు ఇంకా సహజం. ఒకటికి మించిన పార్టీలు కలిసి పోటీ చేస్తేనే కూటమి అంటారు.

By:  Tupaki Desk   |   14 April 2024 6:00 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ‘కూటములకు’ అధిక శాతం ఓటములే!
X

ఎన్నికలన్నాక పొత్తులు సహజం.. పోటాపోటీ హామీలు ఇంకా సహజం. ఒకటికి మించిన పార్టీలు కలిసి పోటీ చేస్తేనే కూటమి అంటారు. రెండు పార్టీలు కలిసి బరిలో దిగితే అది పొత్తు మాత్రమే. ఇప్పడు చూస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఏపీలో మాత్రం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా బరిలో దిగాయి. పదేళ్ల తర్వాత ఈ పార్టీలు మళ్లీ జట్టు కట్టాయి.

అప్పట్లోనూ కలిసే.. కానీ,

2014లోనూ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేశాయి. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించినా పోటీ మాత్రం చేయలేదు. 2019కి వచ్చేసరికి ఈ మూడు పార్టీల దారులు వేరయ్యాయి. టీడీపీకి ఘోర ఓటమి ఎదురవగా, బీజేపీ ఖాతా తెరవనేలేదు. జనసేనాని పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడారు. ఆ పార్టీకి రాజోలు సీటు మాత్రమే దక్కింది. ఇప్పుడు మాత్రం ‘కూటమి’గా కలిసి వస్తున్నాయి.

కూటమి అంటే ఓటమేనా?

2009 నుంచి చూస్తే ఉమ్మడి ఏపీలో నాడు టీడీపీ-టీఆర్ఎస్-వామపక్షాలు మహా కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. కానీ, వాటికి వైఎస్సార్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమే ఎదురైంది. 2018లో తెలంగాణ సాకారం అయ్యాక టీ(బీ)ఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వచ్చింది. అయితే, 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని కాంగ్రెస్-టీడీపీ-వామపక్షాలు కలిసి మహా కూటమిగా ఏర్పడి ఎదుర్కొన్నాయి. కానీ, ఘోరంగా ఓడాయి. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణ తెరపై నుంచి తప్పుకొంది.

నాడు కలిసే.. కానీ, కూటమి కాదు

ఎన్టీఆర్ హయాంలో టీడీపీ-వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. నాడు వీటి మధ్యనే పొత్తు ఉండడంతో అది కూటమి కాలేదు. అసలు కూటమి అనే పేరు పెట్టాల్సిన అవసరం రాలేదు. ఇక చంద్రబాబు కూడా వామపక్షాలు, బీజేపీతో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నా కూటమి అనే మాట వాడలేదు. గత 15 ఏళ్లుగా మాత్రమే కూటమి పదాన్ని వాడుకలోకి తెచ్చారు. ఈ వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో (2009, 2018) రెండుసార్లు ఓటమి ఎదురైంది. అంటే ఒక్కసారీ కూటమి నెగ్గలేదు. మరిప్పుడు ఏపీలో వైస్ జగన్ సారథ్యంలోని వైసీపీ ఎదుర్కొంటున్న టీడీపీ-జనసేన-బీజేపీ ఏం జరుగుతుందో చూడాలి.