Begin typing your search above and press return to search.

లైవ్ అప్ డేట్స్: తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు!

తెలుగు రాష్ట్రాలు ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి

By:  Tupaki Desk   |   27 July 2023 8:42 AM GMT
లైవ్ అప్ డేట్స్: తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు!
X

నిన్నమొన్నటివరకూ విపరీతమైన వేసవి తాపానికి సెగలు కక్కిన తెలుగు రాష్ట్రాలు ఎడతెరిపిల్ లేకుండా కురుస్తోన్న వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ ను ముంచిలేపుతున్న వరుణుడు... జిల్లాల్లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సమయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.


అవును... తెలంగాణలో వర్షాలు విశ్వరూపం చూపిస్తున్నాయి. భాగ్యనగరంతో పాటు జిల్లాల్లోనూ రోడ్లు కాలువలను తలపిస్తుండగా.. రైల్వే స్టేషన్లు వరద ప్రవాహంతో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు రంగంలోకి దిగాయి.


వరద నీటిలో వరంగల్ రైల్వే స్టేషన్:

భారీ వర్షాలతో వరంగల్‌ నగరం అతలాకుతలమైంది. భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరద పోటెత్తింది. వరంగల్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జి కింద వరద నిలిచింది. ఇదే సమయంలో హనుమకొండ-వరంగల్‌ రహదారి వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. మరోపక్క వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమైంది.


ఇదే సమయంలో కాడారిగూడె చెరువు కూడా రహదారిపై ప్రవహిస్తోండటంతోపాటు.. పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగి రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. ఎక్కడబడితే అక్కడ చెట్లు రోడ్లకు అడ్డంగా కూలడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులు జిల్లా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.


జలదిగ్బంధంలో జయశంకర్‌ జిల్లా:

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వర్షాలతో తడిసి ముద్దవుతుంది. ఇందులో భాగంగా... మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో ఉండిపోయింది. వాగు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లలోకి 4 నుంచి 5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో కొంతమంది ప్రజలు భయాందోళనకు గురై ఇంటి పైకి ఎక్కారు.

ఈ సమయంలో మరికొంతమంది సమీపంలోని చెట్లపైన తలదాచుకున్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అప్రమత్తం చేశారు. పోలీసులు, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రదేశానికి చేర్చేందుకు చర్యలు చేపట్టారు.

అల్లకల్లోలంగా హైదరాబాద్:

హైదరాబాద్‌ లో నేడు తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. మరికొన్ని గంటల్లో అది వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్ రహదారి, ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, ఖైరతాబాద్ ప్రధాన రహదారిలోని మెట్రో స్టేషన్ వద్ద భారీగా నీరు నిలిచింది.

ఇక సిటీలో దాదాపు అన్ని రహదారుల్లోనూ మోకాళ్ల లోతు నీరు చేరడంతో.. వాహనదారులు, స్థానిక ప్రజలూ నరకం చూస్తున్నారు. దీంతో లింగంపల్లి రైల్వే అండర్‌ పాస్‌ వద్దకు భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి-లింగంపల్లి మార్గాల్లో వాహనాలను మళ్లించారు.

ఇదే క్రమంలో మూసారాంబాగ్‌ వంతెన వద్ద మూసీ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. వంతెన అంచుకు వరదనీరు చేరింది. సికింద్రాబాద్‌ లోని మనోహర్ థియేటర్ సమీపంలో మోకాళ్ల తోతులో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బోయిన్‌ పల్లి, మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, అల్వాల్, తిరుమలగిరి జవహర్‌ నగర్‌, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

హెలికాప్టర్‌ తో సహాయక చర్యలు:

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్‌ లో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పూర్తిగా నీట మునిగిన మోరంచపల్లి గ్రామంలో.. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇప్పటికే వరద ప్రాంతాలకు ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలను తరలించారు. మరోవైపు, ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

ఏపీలోనూ సేం సిట్యువేషన్:

ఏపీలోనూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. అనకాపల్లి, విశాఖ, ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్‌ జిల్లాలో వర్షం ఎడతెరిపి లేకుండ్దా కురుస్తోంది. దీంతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది.

దీంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్.డీ.ఆర్.ఎఫ్., ఎస్.డీ.ఆర్.ఎఫ్. బృంధాలను రంగంలోకి దింపారు.

మరోపక్క ప్రకాశం బ్యారేజీ ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 71వేల క్యూసెక్యులుగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే 40 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ధవళేశ్వరం వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఇదే సమయంలో ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

2వ తేదీ నాటికి మరో అల్పపీడనం:

అల్పపీడనం కేంద్రీకృతమైన బంగాళాఖాతం నుంచి కోస్తా జిల్లాల వైపు నిరంతరాయంగా మేఘాలు వస్తూనే ఉండడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.