Begin typing your search above and press return to search.

తెలుగు బీజేపీ = బీఆర్ఎస్ + టీడీపీ+ జనసేన

కాకపోతే.. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నందున 2014-18 మధ్య అధికారంలో కొనసాగింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 1:30 PM GMT
తెలుగు బీజేపీ = బీఆర్ఎస్ + టీడీపీ+ జనసేన
X

బలం తక్కువ.. బలగం ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇదీ లెక్క. పార్లమెంటులో కీలకమైన బిల్లులు గట్టెక్కిన సందర్భంలో.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో.. ఆఖరికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో.. తెలుగు పార్టీల మద్దతు, హాజరు కనిపించడాన్ని బట్టి ఈ విధంగా చెప్పాల్సి వస్తోంది. అలాగని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అమాంతం అధికారంలోకి వచ్చే చాన్సు లేదు. తెలంగాణలో ఏదో హడావుడి చేసినా. .మొన్నటి ఎన్నికల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఏపీలో అయితే.. ప్రజల ఆదరణ పరంగా మరీ దారుణం. కాకపోతే.. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నందున 2014-18 మధ్య అధికారంలో కొనసాగింది.

తెలంగాణలో చేజేతులా

ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లతో మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. మరో 19 సీట్లలో రెండోస్థానంతో సరిపెట్టుకుంది. వాస్తవానికి ఏడాదిన్నర కిందటి వరకు తెలంగాణలో బీజేపీ రెండోస్థానానికి పోటీదారుగా ఉంది. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చింది. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందం కారణంగానే ఇలా చేసిందనే విమర్శలను ఎదుర్కొంది. సరే.. ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ ఓడిపోవడంతో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

మొన్నటిదాక పోటీ.. రేపు పొత్తు

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో పోటీపడి.. తెలంగాణలో ప్రతిపక్షంలోకి మారిన బీఆర్ఎస్.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్దామనే ఆలోచన చేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. వీటిపై ఆ పార్టీ వర్గాలను పేర్కొంటూ కథనాలు రావడమే కానీ.. అధిష్ఠానం పెద్దల నుంచి మాత్రం ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్ ను అడ్డుకోవాలంటే.. లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే బీజేపీతో కలిసి వెళ్లడం మేలని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడునెలల సమయం ఉన్నందున ఏం జరుగుగుతుందో చూడాలి.

ఏపీలో ఆ రెండింటికి తోక

ఐదేళ్లలో ముగ్గురు అధ్యక్షులు మారినా ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల కంటే ఇప్పుడే బలహీనం అన్నట్లుంది. అయితే, పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన బీజేపీని లాక్కొస్తున్నది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ+జనసేన+బీజేపీ కూటమితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి మోదీ సర్కారు నుంచి ఇబ్బందులు ఎదురవకూడదనే ఉద్దేశంలో ఇంతకాలం బీజేపీని టీడీపీ దూరం పెట్టలేదు. అలాగని దగ్గరకూ తీయలేదు. అయితే, ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఏదో ఒకటి తేల్చుకోక తప్పని పరిస్థితి. ఇప్పటివరకు ఉన్న వాతావరణం ప్రకారమైతే.. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమిగా పోటీ చేయడం ఖాయమనే తెలుస్తోంది.

కొసమెరుపు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పెద్దలతో ఏపీ అధికార పార్టీ వైసీపీ పరోక్ష మద్దతు పలుకుతోందనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో బిల్లులు గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ మద్దతు పలికింది. రాజకీయంగా మాత్రం రెండు పార్టీలది వేర్వేరు దారులే.