అంతరిక్షంలోకి తెలుగమ్మాయి.. చరిత్ర సృష్టిస్తున్న దంగేటి జాహ్నవి ప్రస్థానమిదీ
మన తెలుగమ్మాయి అరుదైన ఘనతకు దగ్గరలో ఉంది. అంతరిక్షంలోకి వెళుతున్న తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 24 Jun 2025 11:09 AM ISTమన తెలుగమ్మాయి అరుదైన ఘనతకు దగ్గరలో ఉంది. అంతరిక్షంలోకి వెళుతున్న తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి భారతదేశానికి గర్వకారణంగా మారింది. అంతరిక్ష యానం వంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న తొలి తెలుగు మహిళగా ఆమె పేరు చరిత్రలో లిఖితమవబోతోంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన ‘టైటాన్ స్పేస్ మిషన్’లో ఆస్ట్రోనాట్ కాండిడేట్ (ASCAN)గా ఎంపిక కావడం ద్వారా ఈ ఘనత సాధించింది. భారతదేశంలో పుట్టి, ఇక్కడే పెరిగిన మహిళ నేరుగా అంతరిక్ష యాత్రకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.
ఈ ప్రతిష్టాత్మక మిషన్‌కు NASA మాజీ వ్యోమగామి విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు. టైటాన్ స్పేస్ సంస్థ అంతరిక్షంలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయోగాత్మకంగా కొద్దిమంది వ్యోమగాములు, పర్యాటకులను 2029 మార్చిలో అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఈ తొలి మిషన్ బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొనబోతోంది. ఈ యాత్రలో ఆమె ఐదు గంటల పాటు అంతరిక్షంలో గడపనుంది. ఈ మిషన్‌కు ఎంపికైన అభ్యర్థులు 2026 నుంచి మూడు సంవత్సరాల పాటు అమెరికా, ఇతర దేశాల్లో కఠినమైన శిక్షణ పొందనున్నారు.
జాహ్నవి వ్యోమగామిగా తన ప్రయాణాన్ని 2021లో ప్రారంభించింది. NASA నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కు భారత్ తరపున ఎంపికై అరుదైన రికార్డు సృష్టించింది. అంతేకాకుండా పోలాండ్‌లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందింది. చిన్న వయస్సులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు పొందింది. ‘సెస్నా 171 స్కైహాక్’ అనే చిన్న రాకెట్‌ను విజయవంతంగా నడిపింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్ వంటి పలు వ్యోమగామి శిక్షణలను కూడా పూర్తి చేసింది. 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్‌గా వ్యవహరించడం ద్వారా తన నాయకత్వ నైపుణ్యాలను నిరూపించుకుంది.
అంతరిక్షం పట్ల ఆసక్తి చిన్నప్పటి నుండే జాహ్నవిలో తలెత్తింది. తల్లిదండ్రులు కువైట్‌లో ఉండడంతో అమ్మమ్మ లీలావతితో కలిసి పెరిగిన జాహ్నవి.. చందమామ కథలు వింటూ ఎదిగింది. ఆ కథలే ఆమె మనసులో అంతరిక్షం పట్ల మక్కువను పెంచాయి. పాలకొల్లులో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి, అంతరిక్షం దిశగా వేసే అడుగు దేశానికి గర్వకారణం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భారత యువతకు ప్రేరణనిచ్చే ఘట్టం కావడం విశేషం.భవిష్యత్తులో ఆమె పేరిట మరెన్నో రికార్డులు నెలకొల్పబడతాయన్న ఆశతో.. జాహ్నవికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
