చెప్పినట్లు జీతం ఇవ్వాలన్న మనమ్మాయి మీద యాసిడ్ దాడి
తాజాగా ఆ కోవలోకే వస్తుంది కువైట్ లో తెలుగు మహిళకు ఎదురైన దారుణ అనుభవం.
By: Tupaki Desk | 10 April 2025 12:00 PM ISTఅరబ్ షేకుల దారుణాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అరబ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పినా.. ఆ దేశాలకు పని కోసం వెళ్లే వారిపై దాష్ఠీకాల్ని ప్రదర్శించే ఆ దేశస్తులకు మాత్రం శిక్షలు పడవా? అన్న రీతిలో కొన్ని ఉదంతాలు వెలుగు చూస్తుంటాయి. తాజాగా ఆ కోవలోకే వస్తుంది కువైట్ లో తెలుగు మహిళకు ఎదురైన దారుణ అనుభవం. చెప్పిన జీతం ఇవ్వాలన్న దానికి యాసిడ్ దాడికి పాల్పడటమే కాదు.. పిచ్చిదన్న ముద్ర వేసి పిచ్చి ఆసుపత్రిలో చేర్చిన వైనం బయటకు వచ్చింది.
ఆసుపత్రి సిబ్బంది ఫోన్ ద్వారా బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో ఈ దారుణం వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..కాకినాడ జిల్లా పొన్నాడకు చెందిన లక్ష్మి భర్త మరణించారు. దీంతో ఉపాధి కోసం రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా కువైట్ కు వెళ్లారు. అక్కడ ఇంట్లో పని చేస్తే నెలకు 150 దీనార్లు వేతనంగా ఇస్తామన్న ఒప్పందం జరిగింది.
ఉద్యోగంలో చేరిన తర్వాత యజమానులు కేవలం 100 దీనార్లు ఇవ్వటంతో లక్ష్మి వారిని ప్రశ్నించింది. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోతు ఆమెపై యాసిడ్ పోశారు. అనంతరం పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఈ దారుణం జరిగి దాదాపు పది రోజులు అవుతోంది. యాసిడ్ దాడి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది.
తనకు జరిగిన దాని గురించి ఆసుపత్రి సిబ్బందికి చెప్పటంతో వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. మరోవైపు బాధితురాలి పాస్ పోర్టు ఇంటి యజమాని వద్దనే ఉండటంతో.. కేసు వెనక్కి తీసుకుంటేనే పాస్ పోర్టు ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచని లక్ష్మి.. పిచ్చాసుపత్రిలో మగ్గుతోంది. ఆమెను కువైట్ పంపిన ఏజెంట్ ను సంప్రదిస్తే.. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి..లక్ష్మికి సాయం చేయాలని కోరుతున్నారు.
