యోగాకు 'అన్నా చెల్లెళ్లు' దూరం..ఏం జరిగిందంటే!
మొత్తంగా రెండు గిన్నీస్ రికార్డులను అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఏపీ సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 22 Jun 2025 1:00 PM ISTఅంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రపంచ దేశాలు సహా.. మన దగ్గర కూడా.. ప్రజలు భారీ ఎత్తు న యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమాలను కొన్ని ప్రభుత్వాలు అధికారికంగానే నిర్వహించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల కార్యక్రమాలను సర్కారు సొమ్ముతోనే ఖర్చు చేశారు. ఇక, ఏపీలో అయితే.. మరింత ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆది నుంచి ఈ కార్యక్రమాన్ని కీలకంగా తీసుకుని ప్రమోట్ చేయడం.. ప్రధాని మోడీ సహా 175 దేశాలకు చెందిన కీలక ప్రతినిధులను ఆహ్వానించడం తెలిసిందే.
మొత్తంగా రెండు గిన్నీస్ రికార్డులను అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఏపీ సొంతం చేసుకుంది. ఇక, ఈ యోగా కార్యక్రమం లో మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా పాల్గొని యోగాసనాలు వేశారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని ఒకే కోణంలో చూసిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపక్షాలు కూడా.. దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ.. యోగాలో పార్టిసిపేట్ చేయలేదు. అంటే.. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనక పోయినా.. ప్రత్యేకంగా వైసీపీ కార్యాలయంలో అయినా.. నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, దానిని కూడా చేయలేదు.
పైగా ఇంట్లోనే కూర్చుని ట్విట్టర్(ఎక్స్)లో విమర్శలు గుప్పించారు. దీనిపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. ఒక లక్ష్యంతో చేపట్టిన కీలక అంతర్జాతీయ కార్యక్రమంపైనా విమర్శలు ఎందుకని జగన్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు కూడా దీనిని లైట్ తీసుకున్నారు. ఇదిలావుంటే.. కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిల సైతం యోగాకు దూరంగ ఉన్నారు. వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య బాండింగ్ పెరుగుతుంది.
గతంలో చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ, ఇప్పుడు జగన్ కానీ, షర్మిలకానీ పార్టిసిపేట్ చేయలేదు. ఇక, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ ఎస్‌కు చెందిన కేటీఆర్, ఆయన సోదరి కవితలు కూడా యోగాకు దూరంగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో వీరికి సామాజిక బాధ్యత లేదా? అనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. అయితే.. ఈ విమర్శలపైనా అన్నా చెల్లెళ్లు స్పందించక పోవడం గమనార్హం.
