Begin typing your search above and press return to search.

ఏపీలో 2 రోజులు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

మండే ఎండల వేళ అనూహ్యంగా వాతావరణం చల్లబడటంతో ‘మే’ చివర్లోనే వర్షాలు పలుకరించటంతో అంతా హ్యాపీగా ఫీలయ్యారు.

By:  Tupaki Desk   |   19 July 2025 10:14 AM IST
ఏపీలో 2 రోజులు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు
X

మండే ఎండల వేళ అనూహ్యంగా వాతావరణం చల్లబడటంతో ‘మే’ చివర్లోనే వర్షాలు పలుకరించటంతో అంతా హ్యాపీగా ఫీలయ్యారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో జూన్ రెండో వారంలో కానీ వర్షాలు పలుకరించవు. అప్పుడప్పుడు మాత్రం జూన్ మొదటి వారంలోనే వర్షాలు వస్తుంటాయి. ఈసారి అందుకు భిన్నంగా చాలా ముందుగా.. మే చివర్లోనే వర్షాలు పడటంతో.. త్వరగా వర్షాకాలం వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అయిన పరిస్థితి.

కట్ చేస్తే.. జూన్ లోనే కాదు జులైలోనూ వర్షాలు సరిగా పడని పరిస్థితి. జూన్.. జులై మాసాల్లో పడాల్సిన వర్షం సరాసరిలోనూ లోటు నెలకొన్న పరిస్థితి. ఇలాంటి వేళ.. శుక్రవారం (జులై 18న) వాతావరణంలో మార్పు చోటు చేసుకోవటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ సీజన్ లో మొదటిసారి హైదరాబాద్ మహానగరం మొత్తాన్ని వర్షం ముంచెత్తింది. అత్యధికంగా మూడు గంటల వ్యవధిలో దాదాపు 11 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం సికింద్రాబాద్ ప్రాంతంలో నమోదైంది.

భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే కష్టాలు.. నష్టాలు మరోసారి ఎదురయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పడిన వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మరి.. ఈ వర్షాలు ఎన్ని రోజులు పడతాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఏపీలో రెండు రోజులు (శనివారం, ఆదివారం).. తెలంగాణలో మాత్రం మూడు రోజులు (శని.. ఆది.. సోమవారం) వర్షాలు పడటం ఖాయమని వాతావరణ శాఖకు చెందిన నిపుణులు చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం దక్షిణ.. మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొన్నారు. బికనీర్.. సికార్.. వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు వాయుగుండం కొనసాగుతోంది.

ఏపీ విషయానికి వస్తే.. చెన్నై మీదుగా తూర్పు.. పడమరకు ద్రోణి విస్తరించిన నేపథ్యంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శని.. ఆదివారాల్లో కోస్తా.. రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 22 వరకు ఏపీలో వర్షాలు పడే వీలుందని.. ఈ నెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెబుతున్నారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు హోరు మొదలైనట్లే. సో.. ప్రజలు కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.