Begin typing your search above and press return to search.

పెద్దల సభకు ముగ్గురు...టీడీపీ కొలమానం అదే !

ఈ ముగ్గురినీ ఎంపిక చేయడంలో టీడీపీ కొలమానం కరెక్ట్ గానే ఉంది అని అంటున్నారు. మూడు ప్రాంతాలకూ న్యాయం జరిగింది. అలాగే ఉన్నత విద్యా వంతులకు అవకాశం ఇచ్చారు.

By:  Satya P   |   7 Jun 2026 2:00 PM IST
పెద్దల సభకు ముగ్గురు...టీడీపీ కొలమానం అదే !
X

తెలుగుదేశం పార్టీ దశాబ్దాల చరిత్ర కలిగినది. ఆ పార్టీ ఎపుడూ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేస్తుంది. ఆచీ తూచీ అన్ని రకాలుగా పరిశీలిస్తుంది. అలా ఎంపిక చేసిన అభ్యర్ధులుగా తాజాగా మూడు సీట్లకు టీడీపీ నుంచి ముగ్గురుని ఎంపిక చేసారు. ఈ ముగ్గురూ విద్యావంతులు. అంతే కాదు పెద్దల సభకు అర్హులుగా పార్టీ భావించింది. ముందుగా భాష్యం రామక్రిష్ణను తీసుకుంటే ఆయన దశాబ్దాలుగా ఏపీలోనే కాదు తెలంగాణాలోనూ విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో సేవ చేస్తున్నారు. విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఆయన ఎంపిక వల్ల రాజ్యసభలో టీడీపీకి ఒక బలమైన వాయిస్ దొరికింది అనుకోవాలి.

పారిశ్రామివేత్తగా :

ఇక రెండవ అభ్యర్ధిగా ఎంపిక చేసింది సానా సతీష్ బాబుని. ఈయన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం, తమ్మవరం గ్రామానికి చెందిన వారు. 1994లో విద్యుత్తు శాఖలో ఉద్యోగం చేరి విద్యుత్తు శాఖ సబ్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ మీదట హైదరాబాద్ వెళ్ళి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వారు. టీడీపీలో చాలా కాలంగా పనిచేస్తూ వచ్చిన వారు. 2024 ఎన్నికల్లో కాకినాడ టికెట్ కోరుకున్నారు. పొత్తులలో భాగంగా దానిని జనసేనకు కేటాయించడంలో 2024 డిసెంబర్ లో రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఆయనకు చాన్స్ ఇచ్చారు అయితే ఏణ్ణర్ధంలోనే సభ్యత్వం ముగియడంతో ఆయనకు మరోసారి టీడీపీ అవకాశం కల్పించింది. విద్యావంతుడిగా పారిశ్రామికవేత్తగా ఉన్న సానా సతీష్ బాబు పెద్దల సభలో టీడీపీకి సరైన ఎంపిక అని భావిస్తున్నారు.

యువ కెరటంగా :

ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పెద్ద కుమారుడు టీడీపీ గత ఎనిమిదేళ్ళుగా ఎంతో సేవ చేస్తున్న వారు అయిన చింతకాయల విజయ్ కి రాజ్యసభ సభ్యత్వం దక్కడం అంటే బీసీలకు గౌరవంగా భావిస్తున్నారు. ఆయన యువ నేతగా ఐ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్న విజయ్ పార్లమెంట్ లో తన గళం వినిపించాలని మొదటి నుంచి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టికెట్ కేటాయించాల్సి ఉంది. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో విజయ్ కి ఇపుడు కరెక్ట్ టైం లో చాన్స్ దక్కింది. మొత్తం ముగ్గురులో అత్యంత పిన్న వయస్సు కలిగిన వారు. నాలుగు పదుల వయసులోపే పెద్దల సభలో అడుగుపెడుతున్న విజయ్ మంత్రి నారా లోకేస్ బృందంలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసిన ఆయన ఉన్నత విద్యా వంతుడిగా ఉన్నారు.

సమీకరణలు సరిగ్గా :

ఈ ముగ్గురినీ ఎంపిక చేయడంలో టీడీపీ కొలమానం కరెక్ట్ గానే ఉంది అని అంటున్నారు. మూడు ప్రాంతాలకూ న్యాయం జరిగింది. అలాగే ఉన్నత విద్యా వంతులకు అవకాశం ఇచ్చారు. రాజకీయంగా అందరూ యువకులు కిందనే లెక్క. అంతే కాదు మూడు రంగాలకు చెందిన ముగ్గురూ రాజ్యసభలో టీడీపీ బలమైన వాణిని వినిపిస్తారని కూడా అంటున్నారు. మొత్తం మీద టీడీపీ అధినాయకత్వం చేసిన ఈ కసరత్తు వల్ల సమర్ధులకే చాన్స్ దక్కింది అని అంటున్నారు. సామాజిక కోణంలో చూసినా గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గానికి కొస్తాలో కమ్మ సామాజిక వర్గానికి ఉత్తరాంధ్రాలో బీసీలకు న్యాయం చేసినట్లు అయింది అని సూత్రీకరిస్తున్నారు.