Begin typing your search above and press return to search.

'డాల్లాస్ పురం' అంటే H1B, F1 కట్

అనేకమంది బిర్యానీ కోసం డల్లాస్‌కి వెళ్తున్నారంటే అక్కడ ఎంత వ్యాపారం జరుగుతుందో ఆలోచించాలి. తినడం తప్పు కాదు, కానీ ఆ పోస్టులు పెడుతూ "డాల్లస్‌పురం" అనేది కామన్ పదంగా మారింది.

By:  Tupaki Desk   |   15 July 2025 6:00 PM IST
డాల్లాస్ పురం అంటే H1B, F1 కట్
X

‘అతి సర్వత్రా వర్జయేత్’ అంటారు. ఏది చేసినా లిమిట్ ప్రకారం చేయాలి. ఎక్కడ వెళితే అక్కడ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. కానీ మన వాళ్లకు అత్యుత్సాహం ఎక్కువ. అమెరికా వెళ్లినా దాన్ని ఇండియాలాగా వ్యవహరిస్తామంటే కుదరదు. ఇప్పుడు ట్రంప్ పాలనలో అసలే వీలు కాదు.. మనవాళ్ల వెర్రివేషాలకు ఇప్పుడు అమెరికాలో విమర్శల వర్షం కురుస్తోంది.

అమెరికాలో నివసిస్తున్న మన తెలుగు ప్రజలు కొన్ని విషయాల్లో సృష్టిస్తున్న మార్పులు, వాటి పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక తెల్లవారికి ఇబ్బంది కలిగించేలా కొన్ని నగరాల పేర్లను మార్చడం, రోడ్లపై అడ్డగోలుగా వ్యవహరించడం వంటి చర్యలు ఇప్పుడు మనపైనే విమర్శలకు దారితీస్తున్నాయి. ఇటీవల ఒక తెలుగు వ్యక్తిని ఉద్దేశించి ఒక తెల్ల వ్యక్తి "మీ ఇండియాకి వెళ్ళండి" అనడం పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దీనికి కారణం మన వాళ్ళ అతి ప్రవర్తనే కాదా?

- ఎందుకు వెళ్ళాం అమెరికాకి?

ప్రతి తల్లిదండ్రులు లక్షల అప్పులు చేసి, పిల్లలు ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించి, H1B వీసా ఆ తర్వాత గ్రీన్ కార్డ్, పౌరసత్వం పొందాలని కోరుకుంటారు. ఒక మంచి జీవితం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం అమెరికా వెళ్తాం. కానీ కొందరు చేసే పనులు దీనికి విరుద్ధంగా ఉంటున్నాయి.

-రీల్స్ మోజులో "డాల్లస్‌పురం"

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో, ముఖ్యంగా రీల్స్‌లో, డల్లాస్ నగరాన్ని "డాల్లస్‌పురం" అని పేరు పెట్టి, రోడ్ల మీద ఇష్టానుసారంగా డ్యాన్సులు చేయడం, గెంతులు వేయడం వంటివి చేస్తున్నారు. దీనిపై ఎవరైనా అభ్యంతరం చెబితే అది భారత దేశంపై దాడిగా భావించి ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చేస్తున్నది ఎవరు? ఇది నిబంధనలను ఉల్లంఘించడం కాదా అని అక్కడి అధికారులు ప్రశ్నిస్తున్నారు.

- నిఘాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారులు?

త్వరలో కొత్త చట్టం తెచ్చి, ఇలా పేర్లు మారుస్తున్న నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాదారుల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పరిశీలించి, వారికి నోటీసులు ఇస్తారని చాలా మంది అంటున్నారు. ఒక మంచి జీవితం కోసం వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి వేషాలు వేయడం సరికాదని పెద్దలు కూడా చెబుతున్నారు. అమెరికా వెళ్ళింది పునుగులు, బజ్జీలు తినడం కోసమా? మంచి జీవితం కోసమా? అన్నది ప్రవాస భారతీయులు ఆలోచించాలి.

- బిర్యానీ వ్యాపారం.. మరో కోణం

అనేకమంది బిర్యానీ కోసం డల్లాస్‌కి వెళ్తున్నారంటే అక్కడ ఎంత వ్యాపారం జరుగుతుందో ఆలోచించాలి. తినడం తప్పు కాదు, కానీ ఆ పోస్టులు పెడుతూ "డాల్లస్‌పురం" అనేది కామన్ పదంగా మారింది. తల్లిదండ్రులు లక్షల అప్పులు చేసి పంపిస్తే, వీళ్ళ వేషాలు ఏమిటని చాలా మంది అంటున్నారు. మనం చేస్తుంది తప్పు కాదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

- ఇమ్మిగ్రేషన్ నిఘాలో సోషల్ మీడియా

ఇమ్మిగ్రేషన్ అధికారులు సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇలా ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టు టౌన్ల పేర్లు మారుస్తూ ఉంటే వారు ఏమి చేస్తారు? పెద్ద వయసు వారు కూడా ఇలాంటి విషయాలపై యువతకు అవగాహన కల్పించాలి. సమస్య వచ్చినప్పుడు మాత్రం సోషల్ మీడియాకు వచ్చి లెక్చర్లు ఇస్తారు. "మనం అలా చేస్తున్నాం, వీళ్ళు ఇలా చేస్తున్నారు" అని వాదిస్తారు.

- తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అమెరికాలో నివసించే మన తెలుగువారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. స్థానిక సంస్కృతి, నిబంధనలను గౌరవించాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు దాని పర్యవసానాల గురించి ఆలోచించాలి. మన అతి ప్రవర్తన మన భవిష్యత్తుకు ముప్పుగా మారకుండా చూసుకోవాలి.