తెలుగు సీఎంల హస్తిన టూర్.. కేంద్రం ఎటు వైపు?
కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకోవడం ఇప్పుడు కొత్తకాదు. గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు.
By: Tupaki Desk | 15 July 2025 10:41 AM ISTతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బుధవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారమే.. ఢిల్లీకి వెళ్తారు. ఇక, తెలంగాణ సీఎం గురువారంఉదయానికి ఢిల్లీకి చేరుకుంటారు. వీరితో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ .. భేటీ అయి.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై చర్చించనున్నారు. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి రావాలని కేంద్రం నుంచి లేఖలు అందాయి. వీటికి ఓ కే చెబుతూ.. రెండు రాష్ట్రాలు కూడా సమ్మతి తెలిపాయి.
అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడు బీజేపీకి కీలకమే. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బలపడి.. అధికారంలోకి రావాలన్నది ఒక వ్యూహం. దీంతో తెలంగాణ ప్రయోజనాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా.. ఇప్పటి వరకు చేసిన ప్రయోజనాలు పోయి.. దోషిగా నిలిచే అవకాశం ఉంది. ఇది వచ్చే ఎన్నికల నాటికి వ్యతిరేక ఫలితం ఇచ్చినా ఇవ్వొచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ జలాలకు సంబంధించి ఆచితూచి అడుగులు వేయాల్సిందే.
పోనీ.. ఏపీని సర్దుబాటు చేయాలన్నా.. అసలు కేంద్రంలో మోడీ సర్కారు మూడో సారి విజయవంతంగా పాలన ప్రారంభించేందుకు టీడీపీ మద్దతే కీలకం. 16 మంది ఎంపీల మద్దతుతో చంద్రబాబు మోడీకి కొ మ్ము కాస్తున్నారు. సో.. ఇప్పుడు ఏపీ విషయంలో కాదు-కూడదు అన్నా.. తలనొప్పులు తప్పవన్న అంచ నా ఉంది. ఈ నేపథ్యంలో జల వివాదాల విషయంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది కీలకం. ఈ క్రమంలో మధ్యేమార్గంగానే కేంద్రం వ్యవహరించే అవకాశం ఉంది.
గతంలోనూ..
కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకోవడం ఇప్పుడు కొత్తకాదు. గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దీనిని కేసీఆర్.. నోటితో అనుమతి.. నొసటి తో వ్యతిరేకించారన్న విమర్శలు ఉన్నాయి. అయినా.. వివాదం వివాదంగానే సాగింది. దీనిపై కేంద్రం పంచాయతీ పెట్టింది. అప్పట్లో కరోనా నేపథ్యంలో జూమ్ ద్వారా ఇరువురుముఖ్యమంత్రులతో కేంద్రం చర్చించింది. కానీ.. తాను ఇతమిత్థంగా ఒక నిర్ణయం తీసుకోలేదు. ``మీరు మీరు తేల్చుకోండి.. లేక పోతే.. మొత్తం ప్రాజెక్టులు మాకు ఇచ్చేయండి!`` అని షరతు విధించింది. సో.. అప్పట్లో అలా ముగిసింది. మరి ఇప్పుడు ఏం చేసినా.. ఇబ్బందే కాబట్టి.. ఇప్పుడు కూడా ఇదే పంథా అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
