Begin typing your search above and press return to search.

దుబాయ్ లో ఆస్తులు.. తెలుగు రాష్ట్రాల ప్రముఖుల గుండెల్లో ఈడీ!

అక్కడెక్కడో ఉన్న ఈశాన్య రాష్ట్రాలు మొదలు దేశంలోని ఏ మారు మూల ప్రాంతాల్లోనూ తెలుగు వారి పెట్టుబడులు కనిపిస్తూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   11 July 2025 9:54 AM IST
దుబాయ్ లో ఆస్తులు.. తెలుగు రాష్ట్రాల ప్రముఖుల గుండెల్లో ఈడీ!
X

అవకాశాలు ఎక్కడ ఉంటే.. అక్కడ తెలుగోళ్లు ఉంటారన్న పేరుంది. అక్కడెక్కడో ఉన్న ఈశాన్య రాష్ట్రాలు మొదలు దేశంలోని ఏ మారు మూల ప్రాంతాల్లోనూ తెలుగు వారి పెట్టుబడులు కనిపిస్తూ ఉంటాయి. ఇది మన దేశానికి మాత్రమే కాదు.. ఖండాంతరాల్లోనూ అదే పరిస్థితి. అలాంటి తెలుగోళ్లు.. గడిచిన కొన్నేళ్లుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. పన్నుపోటు లేని దుబాయ్ లో పెట్టుబడులు పెట్టటం ఇటీవల కాలంలో ప్రముఖులకు అలవాటుగా మారింది.

సాదాసీదా జనాలకు దుబాయ్ అన్నంతనే రెక్కల కష్టంతో బతుకు బండిని భారంగా లాగే దేశంగా భావిస్తారు. కానీ.. ప్రముఖులు.. రాజకీయ నేతలకు మాత్రం అవకాశాల గని. అందుకే తాము సంపాదించిన మొత్తాల్ని దుబాయ్ లో స్థిరాస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టటం.. భారీగా అద్దెల్ని సొంతం చేసుకునే టెక్నిక్ ను కొంతకాలం నుంచి మొదలు పెట్టారు. మొదట్లో చాలా తక్కువ మంది మాత్రమే దుబాయ్ వైపు చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు నూటికి ఎనభై శాతం మంది పెట్టుబడులు పెట్టేస్తున్న పరిస్థితి.

ఒక అంచనా ప్రకారం దుబాయ్ లో పెట్టుబడి పెడితే ఏడాదికి 10 నుంచి 15 వాతం వరకు అద్దెల రూపంలో వస్తున్న ఆదాయం..దానిమీద ఎలాంటి పన్ను ఆ దేశం విధించకపోవటంతో అందరి చూపు ఆ దేశం మీద పడింది. దీనికి తెలుగు రాష్ట్రాలకు మూడు నాలుగు గంటల జర్నీ దూరంలో ఉండటంతో.. రాకపోకలకు అనువుగా ఉండటం..దుబాయ్ లో డబ్బులు ఉండాలే కానీ ఏమైనా సొంతం చేసుకునే వెసులుబాటు ఉండటంతో అందరిచూపు ఆ దేశం మీద పడింది.

ఈ ట్రెండ్ ఎంతవరకు వెళ్లిందంటే.. పెట్టుబడులు మాత్రమే కాదు.. పార్టీలు.. శుభ కార్యాలు చేసుకోవటానికి సైతం దుబాయ్ కేంద్రంగా మారింది. కొందరు ప్రముఖులు కిట్టీ పార్టీలు కూడా చేసుకునేందుకు సరదాగా దుబాయ్ వెళ్లి వస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు పోగేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు.. దుబాయ్ లో పెట్టుబడులు పెట్టిన వారిపై ఈడీ తాజాగా ఫోకస్ చేసింది. పలువురికి నోటీసులు జారీ చేయటంతో సినీ.. రాజకీయ ప్రముఖుల్లో అలజడి మొదలైనట్లుగా చెబుతున్నారు.

మనచట్టాల ప్రకారం భారీయులు ప్రపంచంలో ఎక్కడైనా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయొచ్చు. పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే.. ఆయా లావాదేవీలకు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం 2022కు అనుగుణంగా ఉంటే సరిపోతుంది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు.. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఆర్ బీఐ అనుమతి అవసరం. ఐటీ రిటర్న్ లో విదేశీ ఆస్తులు.. ఆదాయం గురించి వెల్లడించాల్సి ఉంటుంది.

మన చట్టాల ప్రకారం భారతదేశం నుంచి గరిష్ఠంగా ఒక వ్యక్తి ఏడాదికి 2.5 లక్షల డాలర్లు..అంటే మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.21 కోట్లు మాత్రమే విదేశాలకు బదిలీ చేసే వీలు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే మాత్రం వారు విదేశాల్లో కొనుగోలు చేసిన ఆస్తి విలువకు మూడు రెట్ల వరకు జరిమానా విధిస్తారు. అయితే.. పలువురు ప్రముఖులు అధికారికంగా కాకుండా అనధికారికంగా హవాలా పద్దతిలో డబ్బుల్ని పంపి బినామీల పేరుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ అంశం మీద ఎంట్రీ ఇచ్చిన ఈడీపలువురికి నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోని సినీ..రాజకీయ.. వ్యాపార ప్రముఖులకు కొత్త టెన్షన్ గా మారినట్లు తెలుస్తోంది.