Begin typing your search above and press return to search.

తెలంగాణా ఎన్నికల్లో అపర కుబేరుడు ఆయనేనట...!

ఖరీదైన అభ్యర్ధి. అత్యంత ధనవంతుడు, వందల కోట్లు ఉన్న ఆస్తిపరుడు అపర కుబేరుడు ఒకరు తెలంగాణా ఎన్నికల బరిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 3:32 AM GMT
తెలంగాణా ఎన్నికల్లో అపర కుబేరుడు ఆయనేనట...!
X

ఖరీదైన అభ్యర్ధి. అత్యంత ధనవంతుడు, వందల కోట్లు ఉన్న ఆస్తిపరుడు అపర కుబేరుడు ఒకరు తెలంగాణా ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన ఎవరో కారు, గత ఏడాది మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన 2018లో కాంగ్రెస్ టికెట్ మీదనే మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ మధ్యలో బీజేపీలోకి వెళ్లారు. ఇపుడు సరైన రూట్ లోకి వచ్చేశారు.

కాంగ్రెస్ నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా. ఏకంగా 458 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. వారెవ్వా అనిపించేలా ఉంది కదా ఈ సంపన్నుడి కధ. ఇక చూస్తే మునుగోడు టికెట్ రాజగోపాల్ రెడ్డికి ముందే కేటాయించినా ఆయన నవంబర్ 9న నామినేషన్లకు గడువు కొద్ది సేపటిలో ముగుస్తుంది అనగా పరుగు పరుగున వెళ్లి రిటర్నింగ్ అధికారికి దాఖలు చేసి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో వివరాలు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే.ఈ మొత్తంలో 297.36 కోట్ల రూపాయలు చరాస్తులుగా ఉన్నాయి. నగదు, బ్యాంకు డిపాజిట్లు, సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో 239.31 కోట్ల రూపాయలు విలువ కలిగిన షేర్లు ఉన్నట్టుగా కోమటిరెడ్డి పేర్కొన్నారు.

అదే విధంగా ఆయన భార్య లక్ష్మి పేరు మీద రూ.4.18 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు వ్యవసాయ, వ్యసాయేతర భూములు, వాణిజ్య భవనాలు ఇవన్నీ కలిసి రాజగోపాల్ రెడ్డికి రూ.108.23 కోట్ల స్థిరాస్తులుండగా అందులో ఆయన భార్యకు రూ.48.60 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇక అప్పుల విషయానికొస్తే చాలా తక్కువగానే ఉన్నాయి. కేవలం రూ.4.14 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2021- 22లో ఆయన ఆదాయం రూ. 1.52 కోట్లు మాత్రమే ఉండగా 2022- 23లో ఏకంగా 71.17 కోట్ల రూపాయలకు చేరుకున్నట్టుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి కాలరీస్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్, ఇతర రాష్ట్రాల నుంచి సుషీ ఇన్‌ఫ్రా, మైనింగ్ లిమిటెడ్ పేరుతో పొందిన 16 కాంట్రాక్టుల వివరాలను కూడా అఫిడవిట్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొనడం విశేషం.

ఇక్కడ మరో ముచ్చట చెప్పుకోవాలి. రాజగోపాల్ రెడ్డి 2018లో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను 314 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ అయిదేళ్లలో ఆయన ఆస్తుల నికర విలువ 45 శాతానికి పైగా పెరిగినట్టు అర్ధం అవుతోంది. అంటే రూపాయికి అర్ధ రూపాయి వంతు అన్న మాట.

ఇక దీని కంటే ముందు అంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కేవలం రూ. 66 కోట్లు మాత్రమే ఆస్తులున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అంటే గడచిన తొమ్మిదిన్నరేళ్ళలో రాజగోపాల్ రెడ్డి ఆస్తులు ఎనిమిది రెట్లు పెరిగాయన్న మాట. ఇలా చూస్తే తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులలో అత్యంత ధనవంతుడు, కుబేరుడు ఎవరో కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అర్ధం అవుతోంది.