వాట్సాప్ సేఫ్.. టెలిగ్రామ్‌కే షాక్.. కేంద్రం నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏంటి?
ఇదే సమయంలో టెలిగ్రామ్ యాప్ యూజర్ ప్రైవసీ, యాంటీ-సెన్సార్‌షిప్ విధానాలపై నడుస్తుందని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 16 Jun 2026 11:00 PM ISTదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు రీటెస్ట్ హడావుడి నడుస్తుండగానే కేంద్ర ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ను తాత్కాలికంగా నిషేధించడం తీవ్ర కలకలం రేపింది. పేపర్ లీకులు, అనుమానాస్పద లింకులు, అక్రమ డీలింగ్స్ అన్నీ టెలిగ్రామ్ వేదికగా సాగాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే, ఇదే సమయంలో వందల కోట్ల మంది వాడుతున్న వాట్సాప్ జోలికి వెళ్లకుండా, కేవలం టెలిగ్రామ్‌నే ఎందుకు నిషేధించారు? రెండూ మెసేజింగ్ యాప్సే కదా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి? ఫ్రాడ్‌స్టర్లకు టెలిగ్రామ్ ఎలా అడ్డాగా మారింది? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
రెండూ ఒకటే అనుకుంటే పొరపాటే..
పైకి చూసేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ రెండూ ఒకేలా కనిపించినా.. వాటి అంతర్గత ఫీచర్లు, పనితీరులో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టెలిగ్రామ్‌లో ఉన్న కొన్ని అపరిమితమైన సదుపాయాలే ఇప్పుడు దానికి శాపంగా మారాయని అంటున్నారు. వాట్సాప్‌లో పెద్ద సైజ్ ఫైల్స్ పంపడానికి పరిమితులు ఉంటాయి. కానీ, టెలిగ్రామ్‌లో జీబీల కొద్దీ డేటాను చాలా సులభంగా షేర్ చేయవచ్చు అంటున్నారు. ఇది క్వశ్చన్ పేపర్లు, లీకైన డాక్యుమెంట్లు, పెద్ద మొత్తంలో స్టడీ మెటీరియల్‌ను ఒకేసారి వేలాది మందికి చేరవేయడానికి నేరగాళ్లకు లూప్‌హోల్‌గా మారిందని చెబుతున్నారు.
అపరిమిత సబ్‌స్క్రైబర్లు
వాట్సాప్ గ్రూపులు లేదా కమ్యూనిటీలకు ఒక పరిమితి ఉంటుంది. కానీ టెలిగ్రామ్ ఛానెళ్లలో సబ్‌స్క్రైబర్ల సంఖ్యకు లిమిట్ లేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఒకే ఒక్క క్లిక్‌తో లక్షలాది మందికి సమాచారాన్ని క్షణాల్లో వైరల్ చేయవచ్చు. ఇక వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా, గ్రూపులో యాడ్ అవ్వాలన్నా ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, టెలిగ్రామ్‌లో ఫోన్ నంబర్ పూర్తిగా హైడ్ చేసుకోవచ్చు. కేవలం ఒక యూజర్‌నేమ్‌తో అకౌంట్ రన్ చేయవచ్చు. దీనివల్ల అవతలి వ్యక్తి ఎవరు అనేది కనిపెట్టడం సైబర్ పోలీసులకు కూడా కత్తిమీద సాములా సవాల్ విసురుతోందని అంటున్నారు.
వాట్సాప్ అనేది వ్యక్తిగత లేదా చిన్న సమూహాల కమ్యూనికేషన్ కోసం ఎక్కువగా డిజైన్ చేయబడితే.. టెలిగ్రామ్ ఒక బ్రాడ్‌కాస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లా, క్లౌడ్ స్టోరేజ్ లా పనిచేస్తుంది. ఈ ఫీచర్లే ఫ్రాడ్‌స్టర్లకు అత్యంత అనుకూలంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌ను నిషేధించడానికి కేవలం లీకేజీలు మాత్రమే కారణం కాదు.. దాని వెనుక ఉన్న సహకార లోపం ప్రధాన కారణమని అంటున్నారు. అదేసమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా సైబర్ క్రైమ్ లేదా దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, ఆయా సంస్థలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు సహకరించాలని అంటున్నారు. ఈ విషయంలో వాట్సాప్ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలకు సానుకూలంగా స్పందిస్తుందని చెబుతున్నారు. అనుమానాస్పద అకౌంట్లను గుర్తించడంలో, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి డేటాను అందిస్తుందని అంటున్నారు.
ఇదే సమయంలో టెలిగ్రామ్ యాప్ యూజర్ ప్రైవసీ, యాంటీ-సెన్సార్‌షిప్ విధానాలపై నడుస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వాలు అడిగినా యూజర్ల సమాచారాన్ని ఇవ్వడానికి టెలిగ్రామ్ యాజమాన్యం నిరాకరిస్తూ వస్తోందని అంటున్నారు. అనుమానాస్పద అకౌంట్లను బ్లాక్ చేయడంలో లేదా నేరగాళ్ల వివరాలను పంచుకోవడంలో టెలిగ్రామ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందించదనే ఆ కారణంగానే ఆ యాప్ ను నిషేధించి ఉంటారని అంటున్నారు. నీట్ పేపర్ లీకేజీ వంటి సున్నితమైన కేసులో నిందితుల ఐడెంటిటీని గుర్తించేందుకు టెలిగ్రామ్ నుంచి సరైన సహకారం అందకపోవడం కూడా కేంద్రం నిషేధాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చిందని అంటున్నారు.
టెలిగ్రామ్ తీసుకొచ్చిన అడ్వాన్స్‌డ్ ఫీచర్లు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడినప్పటికీ.. అదే స్థాయిలో క్రిమినల్స్ చేతిలో అస్త్రాలుగా మారాయని అంటున్నారు. పేపర్ లీకేజీలు వంటి దేశ భవిష్యత్తుతో కూడిన అంశాల్లో కఠినంగా ఉండక తప్పదు కాబట్టే, కేంద్రం వాట్సాప్‌ను వదిలి టెలిగ్రామ్‌పై చర్యలకు ఉపక్రమించిందని చెబుతున్నారు. ఈ నిషేధం తాత్కాలికమే అయినప్పటికీ, భవిష్యత్తులో టెలిగ్రామ్ తన నిబంధనలను మార్చుకోక తప్పదనే సంకేతాన్ని కేంద్రం స్పష్టంగా పంపిందని చెబుతున్నారు.
