Begin typing your search above and press return to search.

తెలంగాణ పాఠం.. ఏపీ నేత‌లు నేర్వాల్సిందే..!

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఇక్క‌డ కీల‌క‌మైన విష‌యం ఒక‌టుంది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:30 PM GMT
తెలంగాణ పాఠం.. ఏపీ నేత‌లు నేర్వాల్సిందే..!
X

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఇక్క‌డ కీల‌క‌మైన విష‌యం ఒక‌టుంది. ప్ర‌జ‌లు గుండుగుత్త‌గా ఏ పార్టీకీ మొగ్గు చూప‌లేదు. ఆచి తూచి వ్య‌వ‌హ‌రిం చిన‌ట్టుగానే భావించాలి. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోని నాయ‌కుల‌కు, అహంకారంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌ల‌కు ఈ ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పారు. ఇదే విష‌యం.. ఏపీలోని నాయ‌కులు కూడా గ్ర‌హించాలి. ప్ర‌తిప‌క్ష‌మైనా.. అధికార ప‌క్ష‌మైనా.. ప్ర‌జ‌లు త‌మ‌ను ప‌ట్టించుకునే నాయ‌కులు అనుకున్న‌వారికే ప‌ట్టం క‌ట్టారు.

త‌మ విష‌యంలో దురుసుగా ఉన్న నాయ‌కులు.. త‌మ చెంత‌కు రాని నేత‌ల‌ను వారు దూరం పెట్టారు. క‌ట్ చేస్తే.. ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్షాల‌కు తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితం ఒక లెస్స‌నేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం వైసీపీకి మాత్ర‌మే కాకుండా.. ప్ర‌తిప‌క్షాలుకూడా.. ఈ ఫ‌లితం నుంచి చాలా నేర్వాల‌ని చెబుతున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్నాం కాబ‌ట్టి.. త‌మ‌కు సానుభూతి పెరుగుతుంద‌నే ధోర‌ణికి తెలంగాణ ప్ర‌జ‌లు అడ్డుక‌ట్ట‌వేశారు.

ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. ఎంత మెజారిటీ ఇవ్వాలో అంతే ఇచ్చి ఆపేశారు. ఇక‌, అధికార పార్టీలోనూ త‌మ‌కు మేలు చేశార‌ని అనుకున్న నాయ‌కుల‌కు.. ప‌ట్టం క‌ట్టారు. లేని వారు ఎంత‌టి వారైనా..(సీఎం కేసీఆర్ స‌హా) ప‌క్క‌న పెట్టేశారు. దీనిలో ఎలాంటి మొహ‌మాటానికి తావులేదు. సో.. ఈ ప‌రిణామాల నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నేత‌లు.. ఏపీలో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు ప‌క్కాగా తెలుస్తోంది. ఎప్పుడో ఎన్నిక‌లు ఉన్నాయిలే అని అనుకోకుండా.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాలి.వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవాలి.

ఇక‌, అధికార పార్టీ నాయ‌కులు కూడా.. ఏదో ప‌థ‌కాలు ఇచ్చేస్తున్నామ‌ని కాకుండా.. ప్ర‌జ‌ల మ‌న‌సు తెలుసుకునే ప్ర‌య‌త్నాలు సాగించాలి. క్షేత్ర‌స్థాయిలో సాధ్య‌మైనంత వ‌ర‌కు చిన్న పాటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు న‌డుం బిగించి.. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాలి. ఫైర్ బ్రాండ్స్‌గా ఉంటే గెలిచేస్తామ‌ని అనుకున్న బ‌ల్కా సుమ‌న్ వంటివారిని కూడా.. ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారన్న విష‌యాన్ని వైసీపీ ఫైర్‌బ్రాండ్లు గుర్తు పెట్టుకోవాలి. కులం కార్డు ప‌నిచేయ‌ద‌న్న విష‌యాన్ని రెడ్డి సామాజిక వ‌ర్గం గుర్తించాలి. లేక‌పోతే.. ప్ర‌జ‌లు ఎవ‌రిని ఎక్క‌డ ఉంచాలో అక్క‌డే ఉంచుతార‌నేదుకు పొరుగు రాష్ట్రం ఫ‌లిత‌మే చాలు!