Begin typing your search above and press return to search.

తెలంగాణ ఓటర్ల ఫైనల్‌ జాబితాపై పార్టీల అభ్యంతరం!

తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు ఉన్నారని సమాచారం. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్‌ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.

By:  Tupaki Desk   |   4 Oct 2023 10:35 AM GMT
తెలంగాణ ఓటర్ల ఫైనల్‌ జాబితాపై పార్టీల అభ్యంతరం!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్‌ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్, డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైపోయిందని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో మూడు రోజులపాటు తెలంగాణలో ఎన్నికల సన్నాహాక భేటీలు వరుసగా నిర్వహిస్తోంది.

మరోవైపు తెలంగాణ ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను నేడో, రేపో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 వరకు.. కొత్త ఓటర్ల నమోదుకు 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు ఉండగా.. పేర్ల తొలగింపునకు మరో 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు ఉన్నారని సమాచారం. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్‌ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.. తుది జాబితా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశాలు హైదరాబాద్‌ లో కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసులతో సమావేశం అక్టోబర్‌ 4న మొదలైంది. ఇందులో అధికారులు చెప్పే అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విననున్నారు. ఆ తర్వాత అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేయనుంది.

మరోవైపు రాష్ట్రంలో గతేడాది జరిగిన ఒక్క మునుగోడు ఎన్నికనే సవ్యంగా నిర్వహించలేకపోయిన అధికార యంత్రాంగం.. శాసనసభ సాధారణ ఎన్నికలను ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలుగుతుందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ సహా సీపీఎం, బీఎస్పీ, ఆప్, టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో రూ. వందల కోట్లను అధికార బీఆర్‌ఎస్‌ బహిరంగంగా పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టినా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయిందని తీవ్ర విమర్శలు చేశాయి.

తాజాగా ఒక హోటల్‌ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సం«ఘం సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ తీవ్రంగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల బృందం హామీ ఇచ్చిందని విపక్షాలు తెలిపాయి.

మునుగోడు ఉపఎన్నికతోపాటు గత శాసనసభ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ జాతీయ నేత ఓమ్‌ పాఠక్‌ నేతృతంలో ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోనీరెడ్డి ఈసీ బృందాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ ఓటర్ల జాబితాలో తీవ్ర లోపాలున్నాయని, వాటన్నింటినీ సరిచేసి పకడ్బందీగా తుది జాబితాను ప్రకటించాలని కోరారు.

మరోవైపు మద్యం పంపిణీని నియంత్రించడానికి ఎన్నికల సమయంలో వైన్‌ షాపులను మూసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ పార్టీ సూచించింది. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ కోసం వచ్చిన వేలసంఖ్యలోని దరఖాస్తులను ఇంకా పరిష్కరించలేదని, ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ గడువును అక్టోబర్‌ 4 నుంచి మరో తేదీకి పొడిగించాలన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.