తెలంగాణ టీడీపీ పరిస్థితి ఏంటి? ఏం జరుగుతోంది?
ఇక, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తే.. కొన్నాళ్ల కిందట చంద్రబాబు చాలా గ్యాప్ తర్వాత ఖమ్మంలో సభ పెట్టారు.
By: Tupaki Desk | 28 Sep 2023 6:17 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అయింది. మరో నెల రోజల్లోనే నోటిఫికేషన్ కూడా రానుంది. ఈ క్రమంలో కీలక పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటివి ప్రజల మధ్య ఉంటున్నాయి. ప్రజలతో మమేకం అవుతున్నాయి. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? అసలు ఉన్నట్టా? లేనట్టా? అంటే.. ఉంది. పార్టీకి తెలంగాణ చీఫ్‌గా కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఉన్నారు. కానీ, ప్రస్తుతం మాత్రం ఇంకా టీడీపీ నాయకులు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లినట్టు కనిపించడం లేదు.
అయితే, 2018లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ హవా ఆ రేంజ్‌లో కనిపించడం లేదన్నది వాస్తవం. అప్పట్లో ఏపీలో పార్టీ అధికారంలో ఉంది. స్వయంగా ముఖ్య మంత్రి హోదాలో చంద్రబాబు ఇక్కడ ప్రచారం చేశారు. అదేసమయంలో కాంగ్రెస్‌తోనూ చేతులు కలిపా రు. మొత్తంగా చూస్తే.. ఏపీతో సరిహద్దు పంచుకునే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే.. ఆ నాయకులు తర్వాత బీఆర్ ఎస్ పంచన చేరిపోయారు.
ఇక, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తే.. కొన్నాళ్ల కిందట చంద్రబాబు చాలా గ్యాప్ తర్వాత ఖమ్మంలో సభ పెట్టారు. తెలంగాణ అభివృద్ధిలో తనదే పాత్ర అని చెప్పారు. టీడీపీ తెలంగాణ ప్రజలకు ఏం చేసిందో వివరించారు. తెలంగాణ ఓటర్లను ఓటు అడిగే అధికారం, హక్కు కూడా తమ పార్టీకి ఉన్నాయని నొక్కి మరీ చెప్పారు. దీంతో తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందని, పార్టీ కనీసం ప్రతిపక్షంగా అయినా.. అసెంబ్లీలో అడుగు పెడుతుందని అంచనాలు వచ్చాయి.
కట్ చేస్తే.. చంద్రబాబు అరెస్టు, జైలు వంటి పరిణామాల తర్వాత.. ఆయనకు సంఘీభావం ప్రకటించడం మినహా.. పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుని.. ముందుకు నడిపించడంలో కాసాని విఫలమయ్యారన్న వాదన వినిపిస్తోంది. ఆయన అనారోగ్యం కారణంగా యాక్టివ్‌గా లేకపోయారు.
పోనీ.. మిగిలిన వారైనా దూకుడుగా ఉన్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. అయితే, క్షేత్రస్థాయిలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందనే ప్రచారం మాత్రం జరుగుతోంది. కీలకమైన ఏపీ సరిహద్దు జిల్లాల్లో పార్టీ కేడర్ ఉన్నా.. నడిపించే నాయకులు లేక పోవడంతో ఇప్పుడు తెలంగాణ టీడీపీ పరిస్థితి ఒకింత ఇబ్బందిలోనే ఉందని చెప్పకతప్పదు.